24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో అండర్–18 విభాగంలో జిల్లాస్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీవో గౌస్‌భాష పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. క్రీడాకారులు తమ సొంత సైకిల్‌తో పాల్గొనాలని సూచించారు. జిల్లా స్దాయిలో ఎంపికై న వారు మార్చి 1న ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలో జరిగే రాష్ట్ర స్దాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
జూద స్థావరంపై దాడులు
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణం నగరిగుట్టలోని ఎస్సీ హాస్టల్ వెనుక భాగంలో కంప చెట్ల వద్ద ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న ఆమూరు వెంకట శివారెడ్డి, వెట్టి అశోక్, పగడాల సాయికుమార్, షేక్ సందాని, ఆమూరు రమేష్‌రెడ్డి, పప్పూరి సాయి మునీశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ సీఐ హాజివలి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,150 నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చిల్లర బంకులో చోరీ
వేంపల్లె : వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న చిల్లర బంకులో గురువారం అర్ధరాత్రి ఆకతాయిలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు ఖలీల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి 9 గంటలకు ఖలీల్ యథావిధిగా తమ చిల్లర బంకుకు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారే సరికి బంకు వెనుక వైపు రేకులను నెట్టి ఉన్నట్లు గమనించాడు. తాళాలు తెరిచి చూడగా గల్లా పెట్టె నుంచి రూ.2 వేల నగదుతోపాటు సిగరెట్టు పెట్టెలు కనిపించలేదు. దీంతో అది ఆకతాయిల పని అని బాధితుడు గమనించారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తే ఇలాంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని బాధితుడు తెలిపారు.
తుమ్మలపల్లెలో ఘర్షణ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామంలో బావికి సంబంధించిన స్థలం విషయమై శుక్రవారం సంగటి గంగాధర్‌రెడ్డి, తుమ్మల గంగాధర్‌రెడ్డి ఘర్షణ పడ్డారు. హైవే రోడ్డు వెడల్పులో భాగంగా తుమ్మలపల్లి గ్రామంలో బావికి సంబంధించిన స్థలం విషయంపైన గొడవ పడ్డారు. రెవెన్యూ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లి సర్వే చేస్తుండగా.. అధికారుల ముందే గొడవకు దిగారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


