కొలువుదీరనున్న నందీశ్వరుడు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రెడ్డి కృషి
సీజీఎఫ్, దాతల సహకారంతో నిర్మాణం
● రాష్ట్రానికే తలమానికంగా ఆలయం
● సీజీఎఫ్, దాతల సహకారంతో నిర్మాణం
● రూ.6 కోట్లతో నూతన దేవాలయం
● రేపటి నుంచి 27 వరకు
ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలు
వేంపల్లె : మండలంలోని నందిపల్లెలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో నందీశ్వరుడు కొలువు తీరనున్నాడు. రాష్ట్రానికే తలమానికంగా నూతన ఆలయం నిర్మించారు. గతంలో 150 ఏళ్ల పురాతన శివాలయం ఉండేది. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు చందాలు ప్రోగు చేసుకుని రూ.30 లక్షలతో నూతన ఆలయం నిర్మించాలని గ్రామ సర్పంచ్ మారం సులోచన, కుమారుడు యూకే, యూరప్ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ మారం శ్రీకాంత్ రెడ్డిలను కోరారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి వారు తీసుకెళ్లారు. ఆయన సహకారంతో సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, దాతల సహకారంతో కలిపి దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆలయ ప్రారంభోత్సవంతోపాటు శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి.
వైఎస్సార్‌సీపీ హయాంలో
సీజీఎఫ్ నిధులు మంజూరు
గత వైఎస్సార్‌సీపీ హయాంలో నందిపల్లెలో నందీశ్వర నూతన ఆలయ నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ రూ.45 లక్షలను సీజీఎఫ్ ఫండ్‌కు జమ చేశారు. దీంతో కడప ఎంపీ కృషితో సీజీఎఫ్ కింద రూ.1.80 కోట్లు నిధులు మంజూరు చేయించారు. అలాగే దాతల నుంచి రూ.70 లక్షలు ప్రోగు చేశారు. మిగిలిన రూ.3.50 కోట్లు యూకే, యూరప్ వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ మారం శ్రీకాంత్‌రెడ్డి తన నిధులను ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారు. సుమారు 5 ఎకరాల్లో సువిశాలమైన ప్రదేశంలో నందీశ్వరాలయాన్ని నిర్మించారు.
ఆలయమంతా రాతి కట్టడాలు
నందీశ్వరాలయమంతా రాతి కట్టడాలతో చాలా అందంగా నిర్మించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోటప్పకొండ గ్రామం నుంచి ఆలయానికి సంబంధించిన రాళ్లను కొనుగోలు చేశారు. ఆళ్లగడ్డలో ప్రత్యేకంగా నంది విగ్రహాన్ని మొలిపించి తయారు చేశారు. శివుడు, పార్వతి విగ్రహాలను మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ వద్ద ఉన్న నర్మదా నది గ్రామంలో తయారు చేయించారు. ఆలయం చుట్టూ ఉన్న వినాయకుడుతోపాటు వివిధ దేవతా రూపాల్లో ఉన్న 27 విగ్రహాలను రూ.3 లక్షలు వెచ్చించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పొందారు.
ఐదు రోజులు పాటు వివిధ కార్యక్రమాలు
ఆలయ ప్రారంభ మొదటి రోజు 23వ తేదిన గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, ఆంకురారోహణం, ఆగ్ని ప్రతిష్ఠ, 24న ప్రాతఃకాల పూజ, లక్ష్మీ గణపతి హోమం, మూల మంత్ర హోమాలు, 25న మహారుద్ర హోమం, గ్రామోత్సవంతోపాటు నందీశ్వరుడికి మహానీరాజనం, కోటి దీపోత్సవం, 26న కంచి పీఠాథిపతుల జగద్గురు శంకర విజయోంధ్ర సర్వస్వతి శంకర చార్య స్వామిగల్ ఊరేగింపుతోపాటు యంత్ర ప్రతిష్ఠలు, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజా శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం. 27న రుద్రాభిషేకం చేయడంతోపాటు శివ పార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాటంతోపాటు సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు వేడుకగా జరగనున్నాయి. 5 రోజుల పాటు ఆలయాన్ని దర్శించే భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను అలరించేందుకు 26న గాయకురాలు మధుప్రియ బృందంచే ఆర్కెస్ట్రా కూడా నిర్వహించనున్నారు. నందీశ్వరాలయంలో శివలింగం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, నాయకులు హాజరుకానున్నారు.
నందిపల్లెలో నూతన నందీశ్వరాలయ నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంతో కృషి చేశారు. రూ.30లక్షలతో నిర్మించుకోవాలనుకున్న ఆలయం దాదాపు రూ.6కోట్ల వ్యయమైంది. సీజీఎఫ్ నిధులు మంజూరు చేయడంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆలయమంతా రాతి కట్టడాలతోనే నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోనే తలమానికంగా ఇలాంటి పెద్ద నందీశ్వరాలయం మా గ్రామంలో నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించాను.
– మారం శ్రీకాంత్ రెడ్డి, యూకే, యూరప్ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్, నందిపల్లె
నందిపల్లె గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులందరం కలి పి నూతన ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసు కున్నాం. అందుకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకారం కోరాం. మొదటగా రూ. 30 లక్షలతో నూతన ఆలయాన్ని నిర్మించాలనుకున్నాం. తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకారంతో రూ.1.80 కోట్ల సీజీఎఫ్ నిధులు మంజూరు కావడంతో దాతల సహకారంతో మరింత డబ్బును పోగు చేసి దాదాపు రూ.6 కోట్లతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. – మారం సులోచన, గ్రామ సర్పంచ్, నందిపల్లె
కొలువుదీరనున్న నందీశ్వరుడు
కొలువుదీరనున్న నందీశ్వరుడు
కొలువుదీరనున్న నందీశ్వరుడు


