బాల్యమిత్రుల అపూర్వ కలయిక
స్నేహం వెయ్యేనుగుల బలం
● 80 ఏళ్లు దాటినా కొనసాగుతున్న వారి స్నేహం
● రాజంపేట వేదికగా కలుసుకున్న మిత్రులు
రాజంపేట టౌన్ : వారందరికి ఎనిమిది పదుల వయసు దాటింది. దాదాపు అరవై మూడేళ్ల క్రితం అనంతపురంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత పలువురు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందగా, ఇంకొందరు వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. సహజంగా ఆ వయసులో ఉన్న వారు ఒకరిద్దరు స్నేహితులను మినహా మిగతా వారి గురించి మరచిపోయి కాలాన్ని వెల్లదీస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే అనంతపురంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 1958–1963 బ్యాచ్ విద్యార్థులు ఇందుకు భిన్నమనే చెప్పాలి. 2013 వరకు చిన్ననాటి మిత్రులు ఎక్కడెక్కడో ఉండేవారు. వారిలో కొంత మంది తమ స్నేహాన్ని కొనసాగించేవారు. అయితే 2013లో వారు చదువుకున్న ఇంజినీరింగ్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు మిత్రులందరిని కలిపింది. ఇక అప్పటి నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఉండే ఓ స్నేహితుడి ఊరిలో కలుసుకొని రెండు రోజుల పాటు ఆనంద భరితంగా గడుపుతున్నారు. అందులో భాగంగా శనివారం బెంగళూరు కేంద్రంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థలో ఆఫీసర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన ములక్కాయల జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్ననాటి స్నేహితులు రాజంపేటలోని కాకతీయ కళాశాల ఆడిటోరియంలో కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు ఒకొక్కరు కాకతీయ కళాశాల ఆడిటోరియానికి చేరుకునే సమయంలో.. ముందుగా వచ్చిన మిత్రులు వారికి ఎదురెళ్ళి ఆప్యాయంగా అలింగనం చేసుకొని మిత్రమా.. కుశలమా అంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం అందరూ ఒకచోట కూర్చోని తాము చదువుకున్న రోజుల్లో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే పలువురు తమ ఆరోగ్య రహస్యం గురించి తెలియచేయగా, ఇంకొందరు తమకున్న ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసి వారిపై వారే ఛలోక్తులు వేసుకోవడంతో నవ్వులు పూయించింది. ఏది ఏమైనా ఎనబై సంవత్సరాలపైబడిన వారు స్నేహితులను కలుసుకోవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణించడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలా వుంటే తొలుత కాలం చెందిన మిత్రుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి.. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే స్నేహం వెయ్యేనుగుల బలం. స్వార్థం, కల్మషం లేని ఒక్క స్నేహితుడు ఉన్నా చాలు జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. అయితే మా స్నేహితులందరు కూడా స్వచ్ఛమైన మనస్సుగల వారు. అందువల్లే ఎనిమిది పదుల పైబడిన వయసులోను మా స్నేహం కొనసాగుతుంది. నిజంగా ఇది మా అదృష్టమనే చెప్పాలి.
– కె.రంగనాధం, మాజీ సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి
బాల్యమిత్రుల అపూర్వ కలయిక
బాల్యమిత్రుల అపూర్వ కలయిక


