సెల్‌ చోరీలతో మొదలెట్టి.. ఘరానా దొంగగా మారి.. | - | Sakshi
Sakshi News home page

సెల్‌ చోరీలతో మొదలెట్టి.. ఘరానా దొంగగా మారి..

Feb 22 2026 7:17 AM | Updated on Feb 22 2026 7:17 AM

సెల్‌ చోరీలతో మొదలెట్టి.. ఘరానా దొంగగా మారి..

సెల్‌ చోరీలతో మొదలెట్టి.. ఘరానా దొంగగా మారి..

ప్రొద్దుటూరు క్రైం : అతను రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తాడు. జన సంచారం లేనిచోట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మొదట చిన్న చిన్న సెల్‌ఫోన్‌లను చోరీలు చేస్తున్న అతను.. ఇళ్లకు కన్నాలు వేసే స్థాయికి ఎదిగి ఘరానా దొంగగా మారాడు. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన షేక్‌ నౌమాన్‌ అలియాస్‌ మస్తాన్‌ అనే దొంగను టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని పెన్నానగర్‌కు చెందిన షేక్‌ నౌమాన్‌ పెయింటర్‌ పని చేసుకొనేవాడు. కొన్నేళ్ల నుంచి అతను చెడు వ్యసనాలకు లోనై చోరీలు చేయడం ప్రారంభించాడు. ముందుగా అతను నిద్రపోయిన వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు చోరీ చేసేవాడు. తర్వాత ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చాడు. నాలుగైదు చోట్ల చోరీకి పాల్పడినా అతని నేరాలు బయటికి రాకపోవడంతో భారీ చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇళ్లలో సొమ్ము లూటీ చేసిన తర్వాత పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు తరచు నివాస ప్రాంతాలను మారుస్తూ వచ్చాడు. ఇలా ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాలకు మకాం మార్చి నేరాలు చేసేవాడు. ఇతనిపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ కూడా ఉంది. ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లో నౌమాన్‌పై 10 కేసుల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని బాలాజినగర్‌–2లో నివాసం ఉంటున్న జావిద్‌ అనే స్వర్ణకారుడు ఇంట్లో ఈ ఏడాది 22న రాత్రి చోరీ చేశాడు. పెద్ద ఎత్తున బంగారు దొంగలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు షేక్‌ నౌమన్‌ ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డులోని మోడంపల్లె క్రాస్‌ వద్ద ఉండగా శనివారం టూ టౌన్‌ ఎస్‌ఐ షేక్‌ మహబూబ్‌బాషా సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్‌ చేశారు. అతని వద్ద సుమారు 68 గ్రాములు బంగారు, పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించి పెద్ద మొత్తంలో బంగారు నగలను రికవరీ చేసిన సీఐ వంశీనాథ్‌, ఎస్‌ఐలు మహబూబ్‌బాషా, ఆర్‌ రాఘవేంద్రారెడ్డి, సిబ్బంది గురుశేఖర్‌, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.

నిందితుడి అరెస్ట్‌, బంగారు ఆభరణాలు,

బైక్‌ స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement