చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ కరువైందని,కడపలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక హిట్లర్ పాలన సాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు విమర్శించారు. కడప ఎరమ్రుక్కపల్లె సమీపంలోని కందిపాళెంలో మాజీ సైనికుడు సట్టి నరసింహులు ఇంటిని అక్రమంగా కూల్చిన ఘటనను నిరసిస్తూ అఖిలపక్ష్యం అధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్ష శిబిరాన్ని అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. బుధవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు ఆర్ధరాత్రి ఓ మాజీ సైనికుడి ఇంటిని కూల్చడం దారుణమన్నారు. ఈ పరిస్ధితిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు. ప్రత్యేకించి కడప నగరంలో కుటిల రాజకీయాలు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు అధికమయ్యాయని విమర్శించారు. ఇంటిని కూల్చివేసిన వారిపై కేసులు పెట్టాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ చేస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు పెడితే నోరు మూసుకుంటారన్న ఉద్దేశ్యంతోనే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా 35 కేసులు కట్టారని, కడప నగరంలో మరీ శృతిమించిందన్నారు.
దళితులతో పెట్టుకున్న వారు పతనమే
– కిశోర్ బూసిపాటి
దళితులపై దాడులు చేసి బాధపెట్టిన వారంతా పతనం కాకతప్పదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. ఇంటి కూల్చివేతను నిరసిస్తూ స్వయంగా దీక్షలో కూర్చొన్న కిషోర్ మాట్లాడుతూ ఓ వైపు రాజ్యాంగం అమలైన రోజని అందరూ పండుగ చేసుకుంటుంటే, టీడీపీ నాయకులు మాజీ సైనికుడి ఇంటిని కూల్చి ఆ కుటుంబానికి విషాధం మిగిల్చారన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల ప్రోద్బలంతోనే గంజాయి బ్యాచ్ ఆర్ధరాత్రి అడ వారిని, పిల్లలను బయటకు లాగేసి అరాచకం సృష్టించి ఇంటిని నేలకూల్చారన్నారు. కానీ ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, దీన్ని చూస్తే కడపలో ఆటవిక పాలన సాగుతుందనిపిస్తొందన్నారు. ఈ ఆటవిక చర్యను వైఎస్సారేసీపీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణం అధికారులు బాధ్యులపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు సీహెచ్ వినోద్, సుబ్బరాయుడు, కె. బాబు, త్యాగరాజు, కంచుపాటి బాబు, పి. సంపత్ కుమార్, డా. పెంచలయ్య, తిలక్ నగర్ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంట్
పరిశీలకుడు కె.సురేష్ బాబు


