ఐదంకెల జీతం, కార్పొరేట్ హోదా..ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అదో గొప్ప స్టేటస్. కానీ ఇపుడు కథ మారిపోయింది. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ (Oracle)12 వేల మంది టెకీల ఉద్వాసన కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదేదో తక్కువ పెర్‌ఫార్మర్‌కే పరిమితం కాదు..ఎంతో అనుభవం ఉన్నా, నిపుణులకు కూడా ఇది తప్పలేదు. దీంతో ఆయా ఐటీ ఉద్యోగులు తమ బాధలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, కార్పొరేట్ ఒత్తిడిలుని జీవితం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.
పదేళ్ల పాటు అంకితభావంతో సేవలందిస్తూ, ఏడాదికి రూ. 37 లక్షల వేతనం అందు కున్న వ్యక్తి ఉన్నట్టుండి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వనేష్ మాలి అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీని ప్రకారం సదరు ఐటీ ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఉన్నపళంగా ఉద్యోగం నుండి తొలగించారు. రేపటినుంచి నీ సేవలు అనవసరం అన్న సందేశం వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు అశనిపాతంలా తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే.. బోలెడన్ని కమిట్‌మెంట్స్, ఈఎంఐలు, ఫీజులు లాంటి అవసరాలెన్నో కళ్లముందు మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆందోళన చెందుతారు. కానీ, మనం చెప్పుకోబోయే టెకీ మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించాడు. ఎలాంటి నిరాశ లేదా ఆందోళనకు బదులుగా, ప్రశాంతంగా ఈ పెను తుఫానులాంటి పరిస్థితిని స్వీకరించడం విశేషం. "నేను దీనిగురించి అస్సలు బాధపడటం లేదు. నిజానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపై నేను ఏ ఐటీ కంపెనీలోనూ పని చేయను. నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను." అనే నిర్ణయానికి వచ్చేశాడు.
వ్యవసాయమే ఎందుకూ అంటే
ఇదేదో తాత్కాలిక ఆలోచనో, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదిది. దీని వెనుక ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించిన బలమైన ఆర్థిక ప్రణాళిక ఉంది. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును తెలివిగా పొదుపు చేశాడు. భవిష్యత్తులో ఉద్యోగం పోయినా అతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తగిన ఆర్థిక భద్రతను కల్పించుకున్నాడు. ఇపుడిక ఎలాంటి దిగులు లేకుండా తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ, కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ 'ర్యాట్ రేస్' (Rat Race) అని పిలిచే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచాని దూరంగా, ప్రశాంత జీవనం గడపడమే అతని లక్ష్యం.
ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది దీనిని 'ఆస్పిరేషనల్ మూవ్' (ఆదర్శవంతమైన అడుగు) అని అభివర్ణిస్తున్నారు. లేఆఫ్స్ అనేవి కొన్నిసార్లు మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాలని కొందరు కామెంట్ చేశారు. సొంత రూల్స్‌తో ర్యాట్ రేస్‌నుంచి వైదొలగడం అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ జీవితం కంటే వ్యవసాయం, కుటుంబాన్ని ఎంచుకోవడానికి ధైర్యం , దృఢ విశ్వాసం అవసరమని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో పొదుపు ప్రాముఖ్యత అందర్నీ ఆకట్టుకుంది. ఆకస్మికంగా ఉద్యోగం పోయినా తట్టు కోవాలంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతం కన్నా తనవాళ్ల మధ్య మనశ్శాంతిగా జీవించడంతోపాటు, భూమాతను నమ్ముకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
ఇదీ చదవండి : పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్


