పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.
ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్‌లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్‌లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. పెళ్లి పీటల మీద వరుడు కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పెళ్లి కొడుకుని పోలీసులు తీసుకెళ్లపోయారు.
గెస్ట్‌లంతా గందరగోళంతో చూస్తుండగా, ఎన్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు.
పోలీసులు ఎందుకొచ్చారంటే..
సియారాంపూర్‌కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్‌కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఉన్నట్టుండి ఈ పెళ్లి గురించి తెలిసిన అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ సిగోయిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
దీంతో పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని గ్రామ పెద్ద అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్‌తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి, ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు. అలా కథ సుఖాంతం అయింది.


