విద్యుద్దీపాల అలంకరణలో దర్గా ప్రాంగణం
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, శ్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, శ్రీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. దర్గా పీఠాధిపతి సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో,దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో శుక్రవారం ప్రధాన ఉరుసు మహోత్సవం జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా భక్తులతో కిటకిట లాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్‌లు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. అలాగే పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. .
అలరించిన ఖవ్వాలి పోటీ:
కమలాపురం పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకొని దర్గా ఆవరణంలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటా పోటీగా సాగింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెల్గాంకు చెందిన ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీ కి చెందిన రాజా సర్ఫరాజ్ ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ సాగింది. ఖవ్వాలి ప్రేమికులు పాటలను వింటూ, మజా చేస్తూ ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు.
ప్రముఖుల ప్రార్థనలు:
కమలాపురం ఉరుసు మహోత్సవాన్ని ప్రముఖులు తిలకించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు దర్గా చేరుకున్నారు. స్వామి వారి మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి,దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ వారిని దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. వారిని ఘనంగా సత్కరించారు. ప్రముఖులు పీఠాధి పతి నుంచి ఆశీర్వాదం పొందారు.
భక్తులతో కిటకిట లాడిన దర్గా ప్రాంగణం


