చావడానికైనా సిద్దం.. శ్రీధర్‌ ప్లాన్‌తోనే దాడి: హర్ష వీణ | Harsha Veena Serious Comments on Janasena MLA Arava Sridhar | Sakshi
Sakshi News home page

చావడానికైనా సిద్దం.. శ్రీధర్‌ ప్లాన్‌తోనే దాడి: హర్ష వీణ

Apr 3 2026 11:03 AM | Updated on Apr 3 2026 1:14 PM

Harsha Veena Serious Comments on Janasena MLA Arava Sridhar

సాక్షి, తిరుపతి: జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు తాజాగా స్పందించారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు.

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహకారం లేదు. మాపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్‌ అక్కడే ఉన్నారు. నేను ఎందుకు అని అడిగినందుకు నాపై దాడి చేశారు. తాతంశెట్టి నాగేంద్ర నాపై రెండు దెబ్బలు వేశారు. పది మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారు. ప్లాన్‌ ప్రకారమే మాపై దాడి చేశారు. శ్రీధరే జనసేన వాళ్లను నాపైకి ఉసిగొల్పాడు.

నేను చావడానికైనా సిద్ధమే. కానీ, పోరాటం ఆపను. అరవ శ్రీధర్‌ వ్యవహారం పవన్‌ కల్యాణ్‌కు తెలియకుండా ఉంటుందా?. పోలీసుల విచారణకు నేను సహకరిస్తున్నా. తాతంశెట్టి దాడి చేసేలా ప్రేరేపించింది శ్రీధరే. నన్ను నమ్మించి శ్రీధర్‌ నట్టేట ముంచాడు. జనసేన నేతలే నాపై దాడి చేసి చంపేందుకు చూశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ నాకు న్యాయం చేయాలి. అరవ శ్రీధర్‌కు శిక్ష పడాల్సిందే.. అందుకే నా పోరాటం’ అని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే.. 
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్‌ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమె­పైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా­రహితంగా రక్త­మొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితు­రాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రి­క్తత నెలకొంది. అనంతరం ఆమె  రైల్వేకోడూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై  ఫిర్యాదు చేశారు.

అరవపై చర్యలు తీసుకోండి
అంతకు ముందు అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించినా అరవ  పాల్గొంటున్నారని, ఇది పవన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్‌గేట్‌ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement