సింహాచలం : ‘మీరు స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు.
సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకులు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం.


