ట్రంప్‌ షాక్‌: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు | US Cancels 28,000 Trucker Licences Impacting Immigrants | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ షాక్‌: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

Aug 5 2026 9:01 AM | Updated on Aug 5 2026 9:01 AM

US Cancels 28,000 Trucker Licences Impacting Immigrants

వాషింగ్టన్‌: అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారనే కారణంతో పాటు నిబంధనలు పాటించని సుమారు 28,000 మంది వాణిజ్య ట్రక్ డ్రైవింగ్ లైసెన్సులను (సీడీఎల్) రద్దు చేసినట్లు శ్వేతసౌథం అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో భారతీయ వలసదారులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

నార్త్ అమెరికన్ పంజాబీ ట్రకర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాలో దాదాపు 1,30,000 నుంచి 1,50,000 మంది భారతీయ సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. ఫ్లోరిడాలో ఆగస్టు 2025లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి భారతీయ డ్రైవర్ చేసిన అక్రమ యూ-టర్నే కారణమని తేలడంతో రవాణా శాఖ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను సరిగా ప్రదర్శించలేకపోయారనే కారణంతో ఇప్పటికే సుమారు 26,000 మందిని రోడ్లపై డ్రైవింగ్ చేయకుండా నిషేధించారు.

ఈ భారీ కొరతను భర్తీ చేయడానికి అమెరికా ప్రభుత్వం ‘ఫ్రీడమ్ హౌలర్స్’ అనే సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి అదనపు డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు లేకుండా నేరుగా సీడీఎల్ లైసెన్సులు పొందేలా సడలింపులు కల్పిస్తున్నారు. సైనికులు దేశ భద్రతలో ఎలాగైతే నిరూపించుకున్నారో, అలాగే ఈ రంగానికి కూడా సరైన వారవుతారని రవాణా కార్యదర్శి సీన్ డఫీ స్పష్టం చేశారు. అయితే, విదేశీ డ్రైవర్లపై ఈ నిషేధం అమెరికా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హనీమూన్ హత్య.. తెరపైకి క్యాటరింగ్ బిల్లు వివాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement