హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది.
అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.
భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?
H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
ఐటీ కంపెనీలపై అదనపు భారం
అమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.
ఎంత ఫీజు?
ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.
ఎందుకీ పెంపు?
అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.
తుది నిర్ణయం ఎప్పుడంటే..
అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది.


