అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, మనీ లాండరింగ్ సమీక్షలో వెల్లడైన తీవ్రమైన ఆర్థిక లావాదేవీల సందేహాలే అసలు కారణమని ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాపిటల్ వన్’ అమెరికా ఫెడరల్ కోర్టుకు స్పష్టం చేసింది.
రాజకీయ కక్షసాధింపు కాదన్న బ్యాంక్
2021 జనవరి 6న వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అనంతరం తమ రాజకీయ భావజాలం నచ్చక బ్యాంక్ అక్రమంగా తమ ఖాతాలను మూసివేసిందని (‘డీ-బ్యాంకింగ్’) ట్రంప్, ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ క్యాపిటల్ వన్ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.
తమ 'యాంటీ మనీ లాండరింగ్' నిపుణుల బృందం నెలల తరబడి జరిపిన సమగ్ర విశ్లేషణ, సందేహాస్పద ఆర్థిక లావాదేవీల తీరుతెన్నుల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంకింగ్ మార్గదర్శకాలు, బ్యాంక్ అంతర్గత నియమావళి ప్రకారమే ఖాతాలను క్లోజ్ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కోణం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోవడానికి ట్రంప్ బృందానికి అనేక నెలల సమయం, పొడిగింపులు కూడా ఇచ్చామని నివేదికలో పేర్కొంది.
బిలియన్ డాలర్ల లీగల్ పోరాటం
క్యాపిటల్ వన్‌తో పాటు మరొక దిగ్గజ బ్యాంక్ ‘జేపీమోర్గన్ ఛేజ్’పై కూడా ట్రంప్ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్లు) పరిహారం కోరుతూ దావా వేశారు. అమెరికాలో కన్జర్వేటివ్ నాయకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి తొలగిస్తున్నారని ట్రంప్ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. అయితే, చట్టపరమైన లేదా ఇమేజ్ పరమైన ముప్పు ఉన్న ఖాతాలపై రిస్క్ నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకోవడం సాధారణ ప్రక్రియ అని బ్యాంకింగ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
పెరిగిన డీ-బ్యాంకింగ్ వివాదం
ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో ‘అమెరికన్లందరికీ న్యాయమైన బ్యాంకింగ్ హక్కులు’ పేరుతో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రాజకీయ ప్రాతిపదికన కస్టమర్ల ఖాతాలను మూసివేయడాన్ని ఇది నిషేధిస్తుంది. ఒకవైపు మనీ లాండరింగ్ నిబంధనలను బ్యాంకింగ్ దిగ్గజాలు కోర్టులో తెరపైకి తెస్తుండగా, మరొకవైపు ట్రంప్ న్యాయ బృందం దీనిని వ్యాపార ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణిస్తుండటంతో ఈ చట్టపరమైన పోరాటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం


