కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్‌పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్ ప్రకటించారు.
చర్చలు లేవన్న ఇరాన్
ఇరాన్ సోమవారం ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్‌తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు.


