ట్రంప్‌.. అబ్బో! చాలా దూరం వెళ్లారా? | Trump Crosses The Line Americans Turn Against His Immigration Push | Sakshi
Sakshi News home page

ట్రంప్‌.. అబ్బో! చాలా దూరం వెళ్లారా?

Aug 3 2026 9:01 AM | Updated on Aug 3 2026 9:14 AM

Trump Crosses The Line Americans Turn Against His Immigration Push

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్‌ తన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు అదే వలస విధానం ఆయనకు రాజకీయ సవాల్‌గా మారుతోందా?.. తాజా సర్వే ఫలితాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.

ట్రంప్‌ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల విషయంలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌–NORC సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెర్చ్‌ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయడంలో ట్రంప్‌ తన అధికార పరిధిని మించుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఆయన వలస విధానానికి ఉన్న మద్దతు 49 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 39 శాతానికి పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే మద్దతు 10 శాతం పాయింట్లు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో వలసల అంశం ట్రంప్‌ ప్రచారంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో ట్రంప్‌ తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. చట్టబద్ధ వలసలపై ఆంక్షలు విధించే విషయంలోనూ దాదాపు సగం మంది ప్రజలు ఆయన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 

దాదాపు 80 శాతం మంది రిపబ్లికన్‌ ఓటర్లు ట్రంప్‌ వలస విధానాలను సమర్థిస్తున్నారు. వలసల అంశం ఇప్పటికీ ఆయన బేస్‌ ఓటర్లను ఏకం చేసే ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. అయితే కొన్ని చర్యలపై మాత్రం విస్తృత స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. 

వలసదారులను గుర్తించేందుకు ట్రాఫిక్‌ తనిఖీలను ఉపయోగించడం, ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లను నగరాల్లోకి పంపించడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. వలస నియంత్రణ అవసరమే అయినప్పటికీ.. దాని అమలు విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు.

వలస విధానంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ ట్రంప్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్వహిస్తున్న తీరుపై కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాదాపు 70 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం. అయితే రిపబ్లికన్‌ ఓటర్లలో మాత్రం ట్రంప్‌పై నమ్మకం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పనితీరును 69 శాతం మంది రిపబ్లికన్లు సమర్థించారు.

వలసలపై కఠిన వైఖరి ట్రంప్‌ రాజకీయ గుర్తింపులో కీలక భాగం. సరిహద్దు భద్రత, అక్రమ వలసల నియంత్రణ అంశాలతో ఆయన తన మద్దతు వర్గాన్ని బలపరిచారు. కానీ తాజా సర్వే మరో విషయాన్ని సూచిస్తోంది. ట్రంప్‌ ప్రధాన మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ.. మధ్యస్థ ఓటర్లు, స్వతంత్ర ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వలసలపై ట్రంప్‌ దూకుడు.. అదే అంశం ఇప్పుడు ఆయనకు కొత్త సవాల్‌గా మారుతోందా? తాజా సర్వే మాత్రం అమెరికన్లలో మారుతున్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ అంశం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కఠిన వలస విధానాలు ట్రంప్‌కు రాజకీయ బలాన్నిస్తాయా? లేక సాధారణ అమెరికన్లలో వ్యతిరేకతను పెంచుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement