ఢిల్లీలోని ఏపీ భవన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అక్షింతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌ల మధ్య ఇంకా పూర్తికాని సర్వే
సర్వే పూర్తికాకుండానే కొత్త భవన్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆఘమేఘాలపై నిర్మాణానికి నిధుల కేటాయింపు
నిర్మాణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ సంస్థ– ఎన్‌బీసీసీకి అప్పగింత
హద్దులు తేల్చుకోకుండా కొత్త భవన్ నిర్మాణమేవిుటన్న కేంద్రం
భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వని కేంద్ర పట్టణాభివృది్ధశాఖ
ముందు సర్వే పూర్తి చేయాలంటూ సూచన
చంద్రబాబు బిల్డప్ చర్యలపై సర్వత్రా విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ స్థలానికి ఇంతవరకు సర్వే పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాలకు చెందిన స్థలం ఎవరిది ఎక్కడనేదీ ఇప్పటి వరకు తేలనేలేదు. ప్రతిరోజూ ఈ స్థల సర్వే విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెడుతూ భవన్‌లో ఉన్న నర్సింగ్ హాస్టల్‌ను కూల్చి, అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సర్వత్రా విమర్శలకు గురవుతున్నాయి.
తొందరపాటు చర్యలు
సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించేశారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది, దీని నిర్మాణం కోసం రూ.123 కోట్లు కూడా కేటాయింపులు చేశారు. సరిగ్గా, ఇక్కడే కేంద్రం అక్షింతలు వేసింది, అసలు భవన్‌కు సంబంధించి సర్వే పూర్తి చేయకుండా, తగిన రిజిస్ట్రేషన్లు జరక్కుండా ఏరకంగా మీరు భవన్‌ను నిర్మిస్తారంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇక్కడి రాష్ట్ర అధికారులను నిలదీసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్ హౌస్ ఆక్రమణల పర్వం!
2024, జనవరి నెలలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సర్కార్‌లో ఢిల్లీలోని భవన్‌కు స్థలం కేటాయింపులు జరిగాయి. 60–40 నిష్పత్తిలో ఈ భవన్ స్థలాన్ని విభజించారు. 60 శాతం భూ మిని ఆంధ్రప్రదేశ్‌కు, 40 శాతం భూమిని తెలంగాణకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత అప్పటి నుంచి నేటి వరకూ ఇక్కడ సర్వే అనేది జరగనేలేదు. పైగా, ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఆనుకుని ఉన్న హైదరాబాద్ హౌస్... కొద్దికొద్దిగా భవన్‌కు సంబంధించిన భూమి ని కబ్జా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినా, ఇక్కడి రెండు రాష్ట్రాల అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు లేదు.
క్షేత్రస్థాయిలో చేదు అనుభవం
ఆంధ్రప్రదేశ్ భవన్‌ను రూ.123 కోట్లతో నిర్మిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇందుకు సంబంధించిన పనులను కేంద్ర సంస్థ అయిన ‘ఎన్‌బీసీసీ’కి అప్పగించింది. కేబినెట్ ఆమోదముద్ర వేసి, నిధులు కేటాయించిన తరువాత క్షేత్రస్థాయిలోకి వచ్చిన ‘ఎన్‌బీసీసీ’కి చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్దకు వెళ్లి అనుమతులు అడిగిన నేపథ్యంలో.. ఇటు ఎన్‌బీసీసీకి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి.
‘2024లో రెండు భవన్‌లను పునర్విభజిస్తూ, పంపకాలు జరిగాయి. అయినా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సర్వే పూర్తి చేయలేదు. ఈ సర్వే, సంబంధిత రిజిస్ట్రేషన్లు పూర్తి కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఎలా నిర్మిస్తారు?’అంటూ పట్టణాభివృద్ధిశాఖ నిలదీసింది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులకు, అటు ఎన్‌బీసీసీ అధికారులకు నోట మాటరాలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
అంతా గొప్పలు కోసమే
ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఏదైనా కట్టడం నిర్మించాలంటే ప్రధానమంత్రి కార్యాలయంతో సహా 18 శాఖల నుంచి అధికారిక అనుమతులు రావాలి. ఈ విషయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీలో పనిచేసే ఆయా భవన్‌లకు చెందిన అధికారులకు తెలిసిందే. ఈనేపథ్యంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ‘అసలు సర్వేనే కాకుండా, అనుమతులు ఎలా వస్తాయి?, తగిన అధికారిక బదలాయింపు ప్రక్రియ పూర్తి కాకుండా కొత్త భవన్ నిర్మాణానికి ఏపీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ని«ధులు కేటాయించడం ఏమిటి? అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం కష్టమనే విషయం ఎన్‌బీసీసీకి తెలియదా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం చంద్రబాబు తన గొప్పల కోసమే ఇటువంటి బిల్డప్పులు ఇస్తున్నారనే విమర్శలు హస్తిన వేదికగా వ్యాపిస్తున్నాయి.
కన్సల్టెంట్‌ల నియామకంలోనూ అక్రమాలే
ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ప్రస్తుతం నలుగురు కన్సల్టెంట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి పనిచేసే కన్సల్టెంట్‌లకు రూ.70 వేల వేతనం మాత్రమే ఆ ప్రభుత్వం ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కన్సల్టెంట్లకు మాత్రం ఒక్కొక్కరికీ రూ.1 లక్ష జీతాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఈ నలుగురి కన్సల్టెంట్‌ల నియామకంలోనూ భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏ అర్హత లేని ఓ మహిళా ఉద్యోగికి రూ.1 లక్ష ఇచ్చి పనిచేయిస్తున్న వైనంపై విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఇక కన్సల్టెంట్‌ల పాత్రపైనా చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయడం, అనుమతులు తీసుకురావడం, ని«ధులు రాబట్టడం వంటి విషయాల్లో వీరు ముందుండాలి. అయితే లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్న వీరు ఏమి చేస్తున్నారు? ప్రభుత్వానికి సరైన సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ ఇస్తే సర్వేనే పూర్తి కాకుండా భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయింపులు ఎలా చేసింది? ఇప్పుడు కేంద్రం ముందు నవ్వులు పాలవడం ఏమిటి? వంటి ప్రశ్నలు హస్తిన వేదికగా గుప్పుమంటున్నాయి.


