ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు.. | Why Black Mambas Are So Dangerous, Shocking Facts About The World Deadliest And Fastest Snake Explained | Sakshi
Sakshi News home page

ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..

Aug 3 2026 3:42 PM | Updated on Aug 3 2026 3:52 PM

 Why Black Mambas Are So Dangerous Facts here

వానాకాలంలో పాములు అధికంగా బయటకు వస్తుంటాయి. పాము కాట్ల భయం ఎక్కువగా ఉంటుంది. మీకు పాముల్లో యముడులాంటి ‘‘బ్లాక్ మాంబా’’ గురించి తెలుసా?  అవి వేగంగా కదులుతాయి.. అత్యంత ప్రాణాంతక విషాన్ని కలిగి ఉంటాయి.. బాగా దూకుడు స్వభావం చూపుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, లెక్కించలేనన్ని మానవ మరణాలకు కారణమయ్యాయని భావిస్తారు. ఇక్కడ ప్రస్తావిస్తున్నది ‘‘బ్లాక్ మాంబా’’ గురించే.. భూమిపై అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రమాదకరమైన పాములు. ఇవి గంటకు 12.5 మైళ్ల వేగంతో పాకుతాయి. వాటి వద్ద ఉన్న ఆయుధం అది ఒక్కటే కాదు. వేటాడే తీరు కూడా అంతే భయంకరం. మెరుపువేగంతో దాడి చేసి ఆహారాన్ని పట్టుకుంటాయి. ఇవన్నీ అద్భుతమైన సామర్థ్యంతో, నిశ్శబ్దంగా జరుగుతాయి.

ఎక్కువగా ఎక్కడ ఉంటాయి?
బ్లాక్ మాంబాలు దక్షిణ, తూర్పు ఆఫ్రికాలోని గడ్డి మైదానాలు, రాతి కొండల్లో నివసిస్తాయి. ఇవి ఆఫ్రికాలో అత్యంత పొడవైన విషపూరిత పాములు. పొడవు 14 అడుగుల వరకు పెరుగుతుంది. సగటు పొడవు 8.2 అడుగులు. వీటి పొలుసులు ఆలివ్ రంగు నుంచి బూడిదరంగు వరకు ఉంటాయి. ప్రమాదం ఎదురైనప్పుడు నోటి లోపల కనిపించే నీలం-నలుపు రంగు కారణంగా వీటికి ఈ పేరు వచ్చింది.

మగ, ఆడ మాంబాల మధ్య బయటకు కనిపించే తేడా ఉండదు. సంతానోత్పత్తి వసంతకాలం, ప్రారంభ వేసవిలో జరుగుతుంది. ఆడ పాములను వెతికేందుకు మగ పాములు చాలా దూరం ప్రయాణిస్తాయి. జతకట్టే హక్కు కోసం ప్రత్యర్థి మగ పాములతో పోరాడుతాయి. ఆడ పాము 10 నుంచి 25 గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటి వద్దకు తిరిగి రాదు. సుమారు 80 నుంచి 90 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. పుట్టినప్పుడు వాటి పొడవు దాదాపు 51 సెం.మీ. ఉంటుంది.

పుట్టిన వెంటనే అవి స్వతంత్రంగా జీవిస్తాయి. మగ, ఆడ పాములు రెండూ తమ పిల్లలను కాపాడవు. 12 నెలల్లో పిల్లల పొడవు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. అయితే ముంగీస వంటి మాంసాహార జంతువుల దాడుల నుంచి తప్పించుకోవాలి.

బ్లాక్ మాంబాలపై అపోహలు
ప్రాణాంతక స్వభావం కారణంగా బ్లాక్ మాంబాలు ఆఫ్రికా సంస్కృతిలో ఎన్నో అపోహలతో ముడిపడ్డాయి. ఈ జాతిపై ఆధారంలేని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు భారీ బ్లాక్ మాంబా “గాలిలా కదులుతూ” దక్షిణ ఆఫ్రికాలోని మేరిప్స్‌కాప్ పర్వతంపై సంచరిస్తుందని నమ్ముతారు. మరికొందరు సుడిగాలి రావడానికి ఈ పామే కారణమని చెబుతారు. తోక చివరపై నిలబడి సమతుల్యం సాధిస్తుందని కూడా ప్రచారం ఉంది. ఇంకో కథనం ప్రకారం బ్లాక్ మాంబా తన శరీరాన్ని చుట్టుకొని తిరుగుతూ దాడి చేస్తుందని చెబుతారు.

బ్లాక్ మాంబాలు ఎంత ప్రమాదకరమంటే?
భూమిపై అత్యంత ప్రాణాంతక జీవుల్లో ఒకటిగా భావించే ఈ పాములు సాధారణంగా భయపడే స్వభావం కలిగి ఉంటాయి. ఎదురైన ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తాయి. ఇవి సామాజిక జీవులు కావు. తమ పరిధిని కాపాడే స్వభావం కూడా ఉండదు. ఒక ప్రాంతంలో నివసించినా దాన్ని రక్షించేందుకు ముందుకు రావు.

అయితే మూలకు నెట్టినప్పుడు వీటి రూపం మారిపోతుంది. తలను పైకెత్తుతాయి. కొన్నిసార్లు శరీరంలో మూడో వంతు భాగాన్ని నేలపై నుంచి లేపుతాయి. నాగుపాము మాదిరి మెడ భాగాన్ని విస్తరింపజేస్తాయి. నల్లటి నోరు తెరిచి బుసలు కొడతాయి. దాడి చేసే వ్యక్తి వెనక్కి తగ్గకపోతే ఒక్కసారి కాదు, పలుమార్లు కాటేస్తాయి. ప్రతి కాటుతో శక్తిమంతమైన న్యూరోటాక్సిన్, కార్డియోటాక్సిన్ విషాన్ని అధికంగా విడుదల చేస్తాయి.

వేట సమయంలో బ్లాక్ మాంబాలు వేగంగా నేలపై పాకుతాయి లేదా తక్కువ ఎత్తులో ఉన్న చెట్ల కొమ్మలపై కదులుతాయి. దాడి చేసే సమయంలో తలను నేలపై నుంచి 1 మీటరు ఎత్తు వరకు ఎత్తగలవు. కదులుతున్నప్పటికీ 50 సెం.మీ. ఎత్తులో తలను ఉంచగలవు.

అత్యంత పదునైన చూపు కారణంగా ఎలుకలు, గబ్బిలాలు, పక్షులు, బల్లులు వంటి ఆహారాన్ని వెంటనే గుర్తిస్తాయి. మెరుపువేగంతో దాడి చేసి కాటేస్తాయి. ఆ తర్వాత వాటి శక్తిమంతమైన విషమే వేటను చంపేస్తుంది. విషం నోటిముందు భాగంలో ఉన్న రెండు ఖాళీ కోరల ద్వారా శరీరంలోకి చేరుతుంది. పాము కాటు వేయకముందు అవి నోటిలో ముడుచుకుని ఉంటాయి. కాటు వేస్తున్నప్పుడు నోటిలోని చిన్న ఎముకల సహాయంతో అవి నిటారుగా నిలుస్తాయి. ఈ విషం వేగంగా పక్షవాతం కలిగిస్తుంది. లాలాజలంలో ఉన్న ఎంజైములు ఆహారాన్ని మృదువుగా మార్చడం ప్రారంభిస్తాయి. తర్వాత దాన్ని పూర్తిగా మింగేస్తుంది.

20 నిమిషాల్లోనే ప్రాణాలు పోయేవి..
ఈ భయంకరమైన పాము కాటు వేసినప్పుడు ప్రతివిషం అందుబాటులోకి రాకముందు దాదాపు ప్రతి సందర్భంలో మరణమే సంభవించేది. సాధారణంగా 20 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు. దురదృష్టవశాత్తూ బ్లాక్ మాంబాలు నివసించే ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ విరుగుడు ఔషధాలు విస్తృతంగా అందుబాటులో లేదు. అందువల్ల మాంబా కాట్ల వల్ల మరణాలు ఇప్పటికీ తరచూ జరుగుతున్నాయి.

బ్లాక్ మాంబా విషం అత్యంత శక్తిమంతమైనది. కేవలం 2 చుక్కల విషమే ఒక మనిషిని చంపేందుకు సరిపోతుంది. ఒక మాంబా కోరల్లో 20 చుక్కల వరకు విషం ఉండొచ్చు. సగటున ఒక కాటుతో 100 నుంచి 120 మిల్లీగ్రాముల విషం శరీరంలోకి చేరుతుంది. 400 మిల్లీగ్రాముల వరకు నమోదైంది. మనిషిని చంపేందుకు 10 నుంచి 15 మిల్లీగ్రాములు సరిపోతాయి. ఈ విషంలో న్యూరోటాక్సిన్లు, కార్డియోటాక్సిన్లు ఉంటాయి. మొదటివి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. రెండోవి గుండెపై దాడి చేస్తాయి.

కాటు వేసిన ప్రదేశంలో స్వల్ప వాపు, నొప్పి లేదా మంట వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. నాలుక, దవడపై నియంత్రణ కోల్పోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, సొరంగం మాదిరిగా కనిపించడం, మసక చూపు, మగత, అన్ని కండరాల్లో పక్షవాతం, మానసిక గందరగోళం ఏర్పడతాయి. బ్లాక్ మాంబా కాటు తర్వాత 45 నిమిషాల్లోనే మనిషి కుప్పకూలే అవకాశం ఉంది. చికిత్స లేకపోతే 7 నుంచి 15 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఎంత త్వరగా చికిత్స అందితే అంత ఎక్కువగా ప్రాణాపాయం తగ్గుతుంది.

చికిత్స లేకపోతే ఈ పాము కాటు వల్ల మరణించే అవకాశం 100 శాతం. ఆఫ్రికా ఖండంలో ప్రతి ఏడాది దాదాపు 20,000 మంది పాముకాట్ల వల్ల మరణిస్తున్నారని భావిస్తారు. దక్షిణ ఆఫ్రికాలోని స్వాజిలాండ్ ప్రాంత ప్రజలు తరతరాలుగా ఈ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రాంతంలో కనిపించే 4 మాంబా జాతుల్లో బ్లాక్ మాంబా ఒకటి. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మీరు వేగంగా పరుగెత్తగలనని అనుకున్నా, బ్లాక్ మాంబా ఇంకా వేగంగా కదులుతుందని గుర్తుంచుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement