శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో పాముకాటు మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకూ మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే కావడం బాధాకరం. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములు ప్రాణాలు బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు కూ డా ఉన్నాయి. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక విష జంతువులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్తున్న వారిని కాటు వేస్తున్నాయి. అందుకే రైతులు, శ్రమజీవులు పొలాలకు వెళ్లినప్పడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పాముకాటు వేసిన వెంట నే సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణా లు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్ యాంటీ వినమ్’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. దాదాపు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచిన ట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలున్నాయి. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది. కానీ మొదటి 5–10 డోసుల వరకూ ఉంటుంది. అటు తర్వాత జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళితే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వీనమ్ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు.
కొన్ని ఘటన
●ఈ నెల 10న ఎల్‌ఎన్‌పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన కరణం సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు.
●గత ఏడాది నవంబరు 10న జలుమూరు మండలం యాతపేట గ్రామానికి చెందిన వాడ సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.
●గత ఏడాది సెప్టెంబరు 11న ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.
●గత ఏడాది జూలైలో ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే 26 మంది పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు విష నాగుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా చేయాలి!
పొలాల గట్లపై నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయడం మంచిది. రాత్రి పూట పొలానికి వెళితే కచ్చితంగా టార్చ్‌లైట్ వినియోగించాలి.
ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి.
పాముకాటు బాధితులకు దైర్యం చెప్పాలి. భ యంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కొందరు కాటు వేయగానే కత్తి, బ్లేడుతో గాట్లు పెడుతుంటారు. అలాంటివి చేయకూడదు.
గాయం పైభాగాన్ని వస్త్రంతో గట్టిగా కట్టి ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
ఆస్పత్రికి తీసుకెళ్లాలి
పాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రు ల్లో యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం.
– పి.సాయికుమార్ వైద్యాధికారి, హిరమండలం


