
బిత్తరపోయిన కొనుగోలుదారు
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా: ఆకలిగా ఉందన్న పిల్లల కోసం ఒక మహిళ బేకరీలో కొని తీసుకొచ్చిన కర్రీ పఫ్ తింటుండగా.. అందులో పాము కనిపించడంతో హడలిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటనపై సీఐ కమలాకర్ కథనం మేరకు.. పట్టణంలోని జౌఖీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం కూతురు, కొడుకు కోసం శ్రీలక్ష్మి అయ్యంగార్ బేకరీలో పిల్లలకు ఒక ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేశారు.
ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కర్రీ పఫ్‌ను తింటుండగా.. పంటికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. నిశితంగా పరిశీలించగా అందులో చనిపోయిన చిన్న పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ.. కర్రీ పఫ్‌ను తీసుకుని సంబంధిత బేకరీ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు.
అయితే ఇవన్నీ మామూలేనని.. తమకు వచ్చిన కూరగాయల్లో చనిపోయిన పాము ఉండి ఉంటుందని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితురాలు తన భర్త శ్రీశైలంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు.