హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
పోలవరం–బనకచర్ల పీఎఫ్‌ఆర్‌కి ఇంకాసూత్రప్రాయ ఆమోదమే లభించలేదు
అది లభించే వరకు డీపీఆర్ తయారీ ప్రక్రియ చేపట్టవద్దంటూ ఏపీపై కేంద్రం ఆంక్షలు విధించింది
అయినా ప్రాజెక్టును కేంద్రం ఆమోదించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్)కు సూత్రప్రాయ ఆమోదం లభించకుండా.. ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియను చేపట్టరాదంటూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డిసెంబర్ 4న రాసిన లేఖలో ఏపీపై ఆంక్షలు విధించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇప్పటివరకు సూత్రప్రాయ ఆమోదమే తెలపలేదని చెప్పారు. అనుమతులు జారీ చేసినట్లు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎలా ప్రకటించారంటూ తప్పుబట్టారు. నిత్యం అబద్ధాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దు్రష్పచారం చేసే హరీశ్‌రావు మరో శుద్ధ అబద్ధాన్ని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు.. ఎంతో పోరాటం
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరహాలో మా ప్రభుత్వం నిష్క్రియాపరత్వంతో వ్యవహరించడం లేదు. మా పోరాటాల ఫలితంగానే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఆంక్షలు విధించింది. గోదావరి జలాలను అక్రమంగా తరలించుకోవడానికి ఏపీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మా ప్రయత్నాల ఫలితంగానే ఈ ప్రాజెక్టుకు తొలిదశ పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తిరస్కరించింది.
ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం దాఖలు చేశాం. వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించినట్టు తెలిసిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, పీపీఏకి వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేశాం. సీఎం, నేను లేఖలు సైతం రాశాం. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారమే ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తామంటూ జలశక్తి శాఖ మంత్రి మాకు హామీ ఇచ్చారు..’అని ఉత్తమ్ తెలిపారు.
వాటాలకు రక్షణ కోరుతున్నాం..
‘గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వరద జలాలపై పరీవాహక ప్రాంత రాష్ట్రాలన్నింటికీ హక్కులుంటాయని, ఏకపక్షంగా ఏపీ ఆ జలాలను వాడుకోవడం ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు చెప్పాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అవసరాలు సంపూర్ణంగా తీర్చడానికి వీలుగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు కాబట్టి, ఏపీ బనకచర్ల ప్రాజెక్టు చేపడితే మా న్యాయమైన హక్కులకు నష్టం కలుగుతుందని తెలియజేశాం.
1,486 టీఎంసీల గోదావరి నికర జలాల్లో తెలంగాణకు 968, ఏపీకి 518 టీఎంసీల వాటాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. గత 11 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్నో అడ్డంకులను సృష్టించడంపై, మిగులు జలాలపై లేని హక్కులను సృష్టించుకోవడానికి అక్రమ ప్రాజెక్టులను ఎడాపెడా చేపట్టడంపై కేంద్రానికి ఆందోళన తెలియజేశాం..’అని మంత్రి వివరించారు.
మూడేళ్లలో ‘డిండి’పూర్తి
చండూరు: బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఆంగడిపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. దీనితో పాటు ఎస్‌ఎల్‌బీసీ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు.
ఏపీ సర్కారుతో కేసీఆర్, హరీశ్ కుమ్మక్కు
‘ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృ«థాగా కలుస్తున్నాయని, వీటిని ఇరు రాష్ట్రాలు సది్వనియోగం చేసుకోవాలని 2016 సెప్టెంబర్‌లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ భేటీలో నాటి సీఎం కేసీఆర్ చేసిన సూచనల నుంచే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగింది. గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనుల కోసం 2018లోనే టెండర్లు ఆహ్వానించినప్పటికీ నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మీనమేషాలు లెక్కించారు.
ట్రిబ్యునల్ కేసులతో సమయాన్ని, వనరులను వృథా చేయకూడదని, దూరదృష్టితో వచ్చే 100 ఏళ్ల అవసరాల కోసం ఆలోచించాలని... 2019 జూలై 28 నాటి సమావేశంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేసీఆర్ అన్నారు. (దీనికి రుజువుగా పాత వార్తల క్లిప్పింగ్‌లను ఉత్తమ్ మీడియాకు ఇచ్చారు).
ఏపీతో చేసుకున్న ఈ అవగాహనలో భాగంగా ఆ రాష్ట్రం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు గత బీఆర్‌ఎస్ సర్కారు సంపూర్ణ సహకారం అందించింది..’ అని ఉత్తమ్ ఆరోపించారు. దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవపట్టించడానికే హరీశ్‌రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


