Telangana: వాహనదారులకు భారీ షాక్‌..! | New Vehicle Owners To Pay Up To 10thousand Road Safety Tax From March | Sakshi
Sakshi News home page

Telangana: వాహనదారులకు భారీ షాక్‌..!

Feb 28 2026 12:49 PM | Updated on Feb 28 2026 1:00 PM

New Vehicle Owners To Pay Up To 10thousand Road Safety Tax From March

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది జీవితకాల పన్ను పెంపుతో పాటు పౌరసేవల రుసుములు పెంచిన రవాణాశాఖ.. ప్రస్తుతం రోడ్డు భద్రతా సెస్సు విధింపునకు సన్నద్ధమైంది. ఆదివారం (మార్చి 1) నుంచి కొనుగోలు చేసే వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను వడ్డించనుంది. వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్  చార్జీల చెల్లింపుతో పాటు రోడ్డు భద్రతా పన్ను కూడా చెల్లించాలి. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో ఏటా సుమారు 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత, రవాణా, ఇతర కేటగిరీలకు చెందిన వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను రూపంలో ఇకనుంచి ప్రతి ఏటా సుమారు రూ.130 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉన్నట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కేంద్రప్రభు త్వం అమల్లోకి తెచ్చిన రోడ్డు భద్రతా చట్టంలో భాగంగా సెస్‌ విధింపు తప్పనిసరిగా మారినట్లు అధికారులు  తెలిపారు. వ్యక్తిగత కేటగిరీలో ద్విచక్ర వాహనాలపై  రూ.2 వేలు, కార్లపై రూ.5000 చొప్పున భారం పడనుంది. 4 సీట్లు, 7 సీట్ల సామర్థ్యమున్న వాహనాలు, అంతకంటే  ఎక్కువ సీట్లు ఉన్న వాటిపై  రూ.10 వేల చొప్పున రోడ్డు భద్రతా సెస్‌ విధించనున్నారు. వాహనాల కొనుగోలు సమయంలోనే  వసూలు  చేయనున్న  ఈ సెస్‌ను రోడ్డు భద్రతా నిధిగా  వివిధ రకాల కార్యకలాపాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో 89 లక్షల వాహనాలు ఉండగా.. వీటిలో 65 లక్షల వరకు బైక్‌లే. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల్లోనూ బైక్‌లే ఎక్కువగా ఉండనున్నాయి.  

నిఘా వ్యవస్థ పటిష్టం.. 
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు.  ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జాతీయస్థాయిలో ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన విధానాలతో 2019లోనే  కేంద్రం  రోడ్డు భద్రతా చట్టాన్ని రూపొందించింది. డ్రైవింగ్‌ ప్రమాణాలను పెంచడంతో పాటు వాహనాల సామరŠాధ్యన్ని, పెంచాలని సూచించింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో  చర్యలు చేపట్టారు. రోడ్డు భద్రతా చట్టం నిబంధనల్లో భాగంగానే ప్రస్తుతం సెస్‌ విధింపు అమల్లోకి  రానుంది. మరోవైపు సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సైతం  ప్రమాదాల నియంత్రణకు  ప్రత్యేక నిధి  అవసరమని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందుకనుగుణంగానే  మార్చి 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి  తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు భద్రతా నిబంంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement