అసాంఘిక శక్తులకు అడ్డాగా అపెరల్‌ పార్క్‌ | KTR comments on the Apparel Park | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తులకు అడ్డాగా అపెరల్‌ పార్క్‌

Jan 1 2026 3:37 AM | Updated on Jan 1 2026 3:37 AM

KTR comments on the Apparel Park

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతో తొండలు గుడ్లు పెట్టేలా మారింది

పిచ్చి మొక్కలు, చెత్త పేరుకు పోయాయి.. 

‘వర్కర్‌ టు ఓనర్‌’కార్యక్రమం మూలన పడింది  

సంక్రాంతి తర్వాత 10 వేల మంది నేతన్నలతో మహాధర్నా

సిరిసిల్ల: దేశంలోనే ఎక్కడా లేని విధంగా నేత కార్మికులను యజమానులను చేసేందుకు రూ.400 కోట్లతో బీఆర్‌ఎస్‌ హయాంలో సిరిసిల్ల శివారులో నిర్మించిన అపెరల్‌ పార్క్‌..కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కలు, చెత్తతో నిర్వహ­ణ లేక పార్క్‌ తొండలు గుడ్లు పెట్టేలా మారిందని విమ­ర్శించారు. 

గతంలో సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్యలకు చలించిపోయిన అప్పటి ఉద్యమనేత కేసీఆర్‌ రూ.50 లక్షలను వారి సంక్షేమానికి అందించారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చే దాకా ధైర్యంగా ఉండండి.. నేతకార్మికులను ఆదుకుంటామని మాట ఇచ్చి. ముఖ్యమంత్రిగా నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. 

రూ.3,400 కోట్లతో రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చీరను బతుకమ్మ పండగ కానుకగా అందించామని చెప్పారు. గతంలో రూ.7 వేల నుంచి రూ.8 వేలు పొందే నేత కార్మికులు బతుకమ్మ చీరల ఆర్డర్లతో రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందుతున్నారని వివరించారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని అపెరల్‌ పార్క్‌ను బుధవారం సందర్శించిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. 

అద్భుత పథకాన్ని పక్కన పెట్టారు.. 
‘సిరిసిల్లలో మూడంచెల వ్యవస్థగా.. నిరుపేద కార్మికులు, మ­ధ్యతరగతి ఆసాములు, పెట్టుబడిదారులైన యజమాను­లు ఉన్నారని కేసీఆర్‌ గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులను సాంచాల (పవర్‌లూమ్స్‌)కు ఓనర్లను చేయాలనే అద్భు­త ఆలోచనలతో రూ.400 కోట్లతో 200 ఎకరాల్లో 50 షెడ్లను నిర్మించామన్నారు. 

ఆ షెడ్లకు నేత కార్మికులను ఓనర్లను చేసి, ప్రభుత్వ వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా శాశ్వత ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావించాం. తొలి విడత 1,500 మంది నేతన్నలను ఓనర్లను చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. తిరుపూరు తరహాలో సిరిసిల్ల వ్రస్తోత్పత్తి రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాం. కానీ దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ‘వర్కర్‌ టు ఓనర్‌’పథకం పక్కన పడింది..’అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని విధాలా ‘ఆసరా’.. 
‘బీడీలు చేస్తే.. మహిళల ఆరోగ్యం పాడువుతుందని రాష్ట్రంలోని 4.50 లక్షల బీడీ కార్మికులకు బీఆర్‌ఎస్‌ హయాంలో ఆసరా పెన్షన్‌ అందించాం. వీరికి మెరుగైన ఉపాధి కల్పించేందుకు అపెరల్‌ పార్క్‌లో గ్రీన్‌నీడిల్, టెక్స్‌ఫోర్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేశాం. ఆ రెండు యూనిట్లతో 2,500 మంది మహిళలకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు ఉపాధి లభిస్తుంది. ఆ రెండు యూనిట్లకు బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఒప్పందాలు జరిగాయి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమ సిరిసిల్లకు రాలేదు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకంతో నేతన్నలకు ఉపాధి కల్పించాల్సిన వర్క్‌షెడ్లు ఇప్పుడు వడ్ల గోదాములుగా మారాయి. మరిన్ని యూనిట్లను గోదాములుగా ప్రైవేటు సంస్థలకు అమ్మేందుకు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంక్రాంతి తర్వాత సిరిసిల్లలోని 10 వేల మంది నేతన్నలతో అపెరల్‌ పార్క్‌లో మహాధర్నా చేస్తాం..’అని కేటీఆర్‌ హెచ్చరించారు. 

ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తానని అన్నారు. వర్కర్లను ఓనర్లుగా మార్చాలని, లబ్ధిదారులకు షెడ్లు, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.

జాతివివక్ష ఘోరమైన నేరం 
డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి హత్యను ఖండించిన కేటీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: జాతివివక్ష ఘోరమైన నేరమని, ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని పేర్కొన్నారు. డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్‌ చక్మా దారుణ హత్య ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే జరిగే ఘోర పరిణామాలకు ఆ ఘటన అద్దం పడుతోందన్నారు. ‘ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వంపై నైతిక, రాజ్యాంగపరమైన బాధ్యత ఉంది. జాతి వివక్షతో కూడిన మాటలు, ప్రవర్తన, రెచ్చగొట్టే చర్యలను నేరంగా పరిగణిస్తూ కఠినమైన, స్పష్టమైన చట్టాలను తీసుకురావాలి. తక్షణ అరెస్టులు, విచారణ, శిక్షలు పడేలా చట్టంలో నిబంధనలు ఉండాలి’అని కేటీఆర్‌ నొక్కి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement