న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం అందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా, తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్ 10న జరిగిన ఈ పేలుడులో 15 మంది మరణించగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ. ఐదు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ సాయం అందించడంతో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తాము అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. తమ కుటుంబానికి గల ఏకైక ఆధారం కోల్పోయామని, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు రోదిస్తున్నారు. దీనిపై ‘ది హిందూ’ ఢిల్లీ ప్రభుత్వ వర్గాలను సంప్రదించగా, పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అర్హులైన వారందరికీ పరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’


