బస్తీ: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని త్వరలో రైల్వేశాఖ నుంచి రూ. 9 లక్షల పరిహారం అందుకోనుంది. ఈ విజయం వెనుక ఆమె సుదీర్ఘ పోరాటం దాగుంది. వివరాల్లోకి వెళితే 2018 మే 7వ తేదీన లక్నోలో జరగాల్సిన బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష కోసం సమృద్ధి ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే లక్నో చేరుకోవాల్సిన రైలు, సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా నడిచింది. ఫలితంగా మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిన సమృద్ధి.. సకాలంలో వెళ్లలేక పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ప్రవేశ పరీక్ష కోసం సమృద్ధి ఏడాది పొడవునా కష్టపడి చదివింది. అయితే తన శ్రమ వృథా కావడంతో ఆమె జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. రైల్వే నిర్లక్ష్యం కారణంగానే తన కెరీర్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె రూ. 20 లక్షల పరిహారం కోరింది.
ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ న్యాయపోరాటంలో, రైల్వే శాఖ తన వాదనలను నిరూపించుకోలేకపోయింది. సరైన కారణం లేకుండా రైలును ఆలస్యం చేయడం అనేది ఆ శాఖ అందించే సేవల్లో లోపమేనని కోర్టు నిర్ధారించింది. కేసును విచారించిన వినియోగదారుల కమిషన్, రైల్వే శాఖ బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా పరిగణించింది. బాధితురాలికి కలిగిన మానసిక క్షోభకు తోడు విద్యా సంవత్సరం నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 9.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌లను ఆదేశించింది.
ఈ ఉదంతంలో రైల్వే శాఖ తన సేవలను సకాలంలో అందించడంలో విఫలమైందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా ఈ పరిహార మొత్తాన్ని విద్యార్థినికి అందజేయాలని కమిషన్ స్పష్టమైన గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత కాలపరిమితిలోగా నగదు చెల్లించలేకపోతే పరిహారం మొత్తంపై 12 శాతం అదనపు వార్షిక వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా?


