కాసరగోడ్ (కేరళ): ఏకైక కుమారుడు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. రైలు ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోయిన నాటి నుంచి వారు దుఃఖంలో మునిగిపోయారు. చివరకు ‘వాడు లేని లోకంలో మేము ఉండలేం’ అంటూ ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేరళలోని కాసరగోడ్ జిల్లా చెమ్నాడ్ పంచాయతీ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పొయినాచిలోని పరంబ ప్రాంతానికి చెందిన వేణుగోపాలన్ నాయర్ (50), ఆయన భార్య స్మిత (42) శుక్రవారం ఉదయం తమ నివాసంలో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మేల్పరంబ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏకైక కుమారుడు ఎం. శివానందన్ (19) మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శివానందన్, గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఒక దుర్ఘటనలో మరణించాడు. బేకల్ బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరికి తన స్నేహితుడు అజేష్‌తో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేదికకు చేరుకోవడానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా, ‘తిరునెల్వేలి జంక్షన్ - జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్’ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శివానందన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అజేష్ గాయాలతో బయటపడ్డాడు.
కొడుకు మరణం తర్వాత వేణుగోపాలన్, స్మిత దంపతులు తీవ్రమైన కుంగుబాటులోకి వెళ్లిపోయారని బంధువులు, పొరుగువారు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ‘వాడు లేకుండా మేము బతకలేము’ అని వారు తరచూ చెబుతుండేవారని, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా వారిలో మార్పు రాలేదని తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు జ్ఞాపకాలు వారిని ప్రతిక్షణం వెంటాడటంతో, మరణమే శరణ్యమని భావించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాసరగోడ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు


