వార్‌ ఎఫెక్ట్‌: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్‌? | LPG gas shortage jolts Indian Coffee House outlets | Sakshi
Sakshi News home page

వార్‌ ఎఫెక్ట్‌: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్‌?

Mar 13 2026 11:58 AM | Updated on Mar 13 2026 12:07 PM

LPG gas shortage jolts Indian Coffee House outlets

తిరువనంతపురం: దక్షిణాదిన దశాబ్దాల చరిత్ర కలిగిన ‘ఇండియన్ కాఫీ హౌస్' (ఐసీహెచ్‌) ఇప్పుడు ఎల్‌పీజీ సంక్షోభంలో చిక్కుకుంది. కేరళ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ సహకార సంస్థ అవుట్‌లెట్లలో వంటగ్యాస్ (ఎల్‌పీజీ)సిలిండర్ల కొరత వేధిస్తుండటంతో, పలు బ్రాంచీలు మూతపడే దిశగా సాగుతున్నాయి. త్రిసూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు చెందిన సుమారు 45 బ్రాంచీల్లో ప్రస్తుతం గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని, కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా మాత్రమే స్టాక్ ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుత గండం నుంచి గట్టెక్కేందుకు కేరళలోని 15 ప్రధాన బ్రాంచీలలో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే, నగరాల మధ్యలో, బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న అవుట్‌లెట్లలో కట్టెల పొయ్యిలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ సమీపంలో ఉన్న బ్రాంచీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో నడిచే హోటళ్లలో భద్రతా కారణాల దృష్ట్యా కట్టెలను వాడటం అసాధ్యం. దీంతో చేసేది లేక భోజనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఇండియన్ కాఫీ హౌస్ వినూత్న ప్రయోగాలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు టీ, కాఫీ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తున్నారు. అలాగే, సాధారణ భోజనం బదులు తక్కువ గ్యాస్ ఖర్చయ్యే బిర్యానీ వంటి పదార్థాలను మాత్రమే అందించేలా మెనూను తయారు చేస్తున్నారు. నెలకు సుమారు 5,000 సిలిండర్లు అవసరమయ్యే ఈ భారీ నెట్‌వర్క్‌కు సరఫరా నిలిచిపోవడంతో వేలాదిమంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఇండియన్ కాఫీ హౌస్ కేవలం పర్యాటక ప్రాంతాల్లోనే కాకుండా కేరళలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్యాంటీన్లను నిర్వహిస్తోంది. గ్యాస్ కొరత కొనసాగితే రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందడం కష్టతరమవుతుందని సహకార సంఘం హెచ్చరించింది. గ్యాస్ సరఫరా సంస్థలకు ఇప్పటికే అత్యవసర లేఖలు రాశామని, ప్రాధాన్యతా క్రమంలో సిలిండర్లను కేటాయించాలని కోరామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ వార్‌.. ఇండక్షన్‌ విప్లవం

Advertisement
 
Advertisement
Advertisement