మధురై: ఎల్‌పీజీ కొరతను ఆసరాగా చేసుకుని, అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై తమిళనాడు ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు నడుం బిగించింది. మధురైలో భారీ ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లైస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై అత్యంత కఠినమైన ‘ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్’ (గుండా చట్టం) కింద కేసు నమోదు చేశారు. సిలిండర్ల నిల్వపై రాష్ట్రంలో ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మధురై సమీపంలోని కోవిల్‌పాపాకుడి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పళని అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన 100 సబ్సిడీ సిలిండర్లు, 109 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనందం నగర్‌లోని మదన్ కుమార్ (27) నివాసంలో సోదాలు నిర్వహించి, మరో 189 సిలిండర్లను గుర్తించారు. మొత్తం కలిపి 398 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పి. మురళి మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టెర్మినల్స్‌లో 7,000 పైగా పెట్రోల్ బంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, కనీసం మూడు వారాలకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో నిల్వలు అయిపోవడం వల్ల ఇటువంటి వదంతులు వ్యాపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు వణిగర్ సంఘంగళిల్ పేరమైపు అధ్యక్షుడు విక్రమరాజా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఏజెంట్లు ఒక్కో సిలిండర్‌ను రూ. 4,000 వరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు ఆహార పదార్థాల లభ్యత భారంగా మారుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం


