ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్‌ | Narendra Modi held a telephonic conversation with Iranian President Masoud Pezeshkian | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ జలసంధిలో భారత్‌ నౌకలు.. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్‌

Mar 13 2026 9:13 AM | Updated on Mar 13 2026 11:02 AM

Narendra Modi held a telephonic conversation with Iranian President Masoud Pezeshkian

ఢిల్లీ:ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ  ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్‌ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి  దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు.   

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్‌ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు  ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.
 

అంతకుముందు 
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్​ అనుమతి ఇచ్చిన తర్వాత  మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన  షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ దాడులతో హర్మూజ్‌ సంధిపై ఇరాన్‌ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్‌లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement