ఇరాన్‌ వార్‌.. ఇండక్షన్‌ విప్లవం | Iran war Induction cooktop sales up 30x in 2 days | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ వార్‌.. ఇండక్షన్‌ విప్లవం

Mar 13 2026 10:39 AM | Updated on Mar 13 2026 10:49 AM

Iran war Induction cooktop sales up 30x in 2 days

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అంతకంతకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటగది ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు ఎల్‌పీజీ (LPG) సరఫరాకు విఘాతం కలగవచ్చనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ‘ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. గ్యాస్ సిలిండర్ల కొరత భయం సామాన్యుడిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నది. ఈ నేపధ్యంలో గత రెండు రోజుల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టౌలు
యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే, ఆ సెగ భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు ఏకంగా 30 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో కూడా ఇండక్షన్‌ స్టౌల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికోసం జనం ఎంతలా ఎగబడుతున్నారంటే, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయి ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు, మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. కేవలం ఇండక్షన్ స్టౌలే కాకుండా, రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలు కూడా నాలుగు రెట్లు పెరగడం విశేషం.

బ్లాక్ మార్కెట్ దందా
యుద్ధ భయాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అక్రమార్కులు గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, సామాన్యుడిని నిలువునా దోచేస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో గృహ అవసరాల సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఏకంగా ₹1,800 కి చేరగా, మధ్యప్రదేశ్‌లో కమర్షియల్ సిలిండర్ ధర ₹4,000 పలుకుతోంది. ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల సెగ కంటే ఎలక్ట్రిక్ వంట సురక్షితమని భావిస్తున్న గృహిణులు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు ఇండక్షన్ కుకింగ్‌నే  ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా..
భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇండక్షన్ స్టౌల వినియోగం పెరుగుతోంది. ఇంధన భద్రతపై ఆందోళనలు ఉన్న అనేక దేశాల్లో ప్రజలు గ్యాస్ ఆధారిత వంట నుంచి ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లుతున్నారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలు ఇండక్షన్ స్టౌలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఇతర ఆసియా దేశాల్లోని ప్రజల కూడా గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఎలక్ట్రిక్ వంట పరికరాలవైపు దృష్టి సారిస్తున్నారు.

పొదుపుతో కూడిన భవిష్యత్తు
ప్రస్తుతం మార్కెట్‌లో బేసిక్ ఇండక్షన్ స్టౌలు ₹1,200 నుండి లభిస్తుండగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్లు ₹14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్‌ల వినియోగాన్ని సమయం, డబ్బు ఆదా చేసేదిగా వినియోగదారులు గుర్తిస్తున్నారు. యుద్ధ భయం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ గ్యాస్ స్టౌల స్థానాన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు పూర్తిగా ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement