యుద్ధంలో ధ్వంసమవుతున్న చమురు ఓడలు
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.
ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్‌లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.
మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్‌కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా పోర్ట్‌కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్‌లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.
మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్‌డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.
మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్ట్‌కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.
మార్చి 4: ఒమన్‌కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.
మార్చి 5: ఇరాక్‌లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్‌లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.
మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్‌బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్‌కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్‌కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.
మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్‌ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్‌కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్‌గార్డ్ ప్రకటించింది.
మార్చి 12: ఇరాక్‌లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్‌సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్


