ఇప్పటికే హోర్ముజ్.. ఇ‍ప్పుడు ఇంకోటి.. | Iran Warns of Bab el-Mandeb Blockade full details | Sakshi
Sakshi News home page

ఇప్పటికే హోర్ముజ్.. ఇ‍ప్పుడు ఇంకోటి.. వామ్మో..

Mar 12 2026 5:16 PM | Updated on Mar 12 2026 6:20 PM

 Iran Warns of Bab el-Mandeb Blockade full details

అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే ప్రపంచంలోని మరో కీలక సముద్ర మార్గాన్ని కూడా నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోయిన పరిస్థితుల్లో… ఇప్పుడు బాబ్ ఎల్-మందెబ్ జలసంధి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి హెచ్చరించారు. ఇలా జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికా తప్పు చేస్తే అంతే..
అల్‌జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇరాన్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే బాబ్ ఎల్-మందెబ్ జలసంధి పరిస్థితి కూడా హోర్ముజ్ లాగే మారవచ్చని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఈ ప్రాంతం పెద్ద ప్రాంతీయ యుద్ధంలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా అన్నారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 138 నౌకలు వెళ్లే ఈ మార్గంలో… ఒక రోజులో కేవలం రెండు నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు సమాచారం.

ప్రపంచ వ్యాపారానికి కీలకం
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మరింత కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు చెందిన నౌకలు వస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడీ ఉద్రిక్తత బాబ్ ఎల్-మందెబ్ జలసంధి వరకు విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యెమెన్-జిబౌటి మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం వెడల్పు కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే.

కానీ ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 6.2 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ జలసంధి మూసుకుపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్‌కు వెళ్లే అత్యంత చిన్న సముద్ర మార్గం పూర్తిగా నిలిచిపోతుంది. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో రెండు వారాల ఆలస్యం మరియు భారీ అదనపు ఖర్చు ఏర్పడుతుంది.

బాబ్ ఎల్-మందెబ్ మార్గమే దిక్కు
ప్రస్తుతం హోర్ముజ్ మార్గం దాదాపు నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాలు బాబ్ ఎల్-మందెబ్ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. ఈ మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్ హౌతి దళాలు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలవు. 2023 నుంచి ఇప్పటివరకు రెడ్ సీ ప్రాంతంలో వందకు పైగా నౌకలపై దాడులు జరిగాయి. 

అయితే ఇప్పటివరకు ఈ యుద్ధంలో హౌతీలు పూర్తిగా రంగంలోకి దిగలేదు. కానీ అవసరమైతే ఎప్పుడైనా చర్యలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్‌తో పాటు బాబ్ ఎల్-మందెబ్ కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా గొలుసు పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి… మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపే పరిస్థితి కనిపిస్తోంది. -వెబ్‌డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement