193 మంది ఎంపీల సంతకాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్‌సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్‌సభకు లేదా రాజ్యసభ చైర్మన్‌కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.
ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్‌సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్‌కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్‌లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి.


