బెంగాల్‌ ‘సర్‌’ తేలేదెప్పుడు? | Sakshi Editorial On Special Intensive Revision in Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ‘సర్‌’ తేలేదెప్పుడు?

Mar 12 2026 1:46 AM | Updated on Mar 12 2026 1:46 AM

Sakshi Editorial On Special Intensive Revision in Bengal

నిరుడంతా బిహార్‌లో కలకలం సృష్టించి, బెంగాల్‌లో అంతకుమించిన వివాదాలతో గత నెల 28న ముగిసిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో మొత్తానికి 8.09 శాతం మంది ఓటర్లు... అంటే 60.06 లక్షల మంది జాబితాల నుంచి కనుమరుగై, నికరంగా 7.04 కోట్ల మంది అసలైన ఓటర్లుగా తేలారని ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతోంది. జాబితాలో లేనివారు న్యాయనిర్ణయ పరిధి(అజ్యుడికేషన్‌)లో ఉన్నట్టు లెక్క. 

ఇలాంటి వారి వినతులను పరిష్కరించటానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ను మంగళవారం కోరింది. ఈ ప్రక్రియ ముగిశాకే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలుంటాయా... ముందే పూర్తవుతాయా అన్నది చెప్పేవారు లేరు. సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమారే ఆ విషయంలో స్పష్టత ఇవ్వటానికి నిరాకరించారు. చాలా అంశాల్లో ఇలా మౌనంగా ఉండిపోవటం ఆయనకు అలవాటే కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు. 

మన దేశంలో మంచికో చెడుకో అట్టడుగు ప్రజానీకంలో దృఢమైన విశ్వాసం ఒక టుంటుంది. ఓటు హక్కు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయినవాళ్లతో సమానమని వారు నమ్ముతారు. నిజానికి అంత నమ్మకం ఉండబట్టే... పార్టీలు దొంగ హామీలిచ్చి నెగ్గుతూ, అటుపై అధికారం వెలగబెడుతూ వంచిస్తున్నా మరో దఫా ఎన్నికల్లో ఓటేయటానికి ఎంతో నిబద్ధతతో క్యూలో నిలబడతారు. సామాన్యుల్లో ఉన్న ఈ అచంచల విశ్వా సమే మన ప్రజాస్వామ్యాన్ని ఈ మాత్రంగానైనా నిలబెడుతోంది. 

బిహార్‌లో ‘సర్‌’ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లోనే ప్రధాన పోరాటం సాగింది. బెంగాల్‌ పరిస్థితి భిన్నం. అక్కడున్నది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కనుక నిరసనలు, ఇతరత్రా ఉద్యమాలు జోరుగానే కొనసాగాయి. అలాగని న్యాయస్థానా లను విస్మరించలేదు. స్వయానా మమత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో ఊరటనిచ్చేవి. ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు గోడు చెప్పుకోవటానికి హైకోర్టు పర్యవేక్షణలో అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లు ఏర్పడతాయి. నిర్ణయాధికారం అధికారులకే అప్పగిస్తే ఇష్టానుసారం చేస్తారన్న భయం ఉండేది. కానీ ట్రిబ్యునళ్లు ఈ సమస్య లేకుండా చేశాయి. నిజానికి ఈ వివాదానికి మూలం ఈసీ తీరులో ఉంది. ఫలానా ప్రాంతంలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఇక్కడ ఉండటం లేదనో, దొంగ ఓటరనో ఫిర్యాదు చేయడానికి ‘ఫామ్‌–7’ వెసులుబాటు ఉంది. అయితే అలా ఫిర్యాదు చేసినవారి వివరాలు చాలా సందర్భాల్లో సక్రమంగా లేవు. ఎదుటి పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోని ఓటర్లు నకిలీలని వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. దాదాపు అన్ని పార్టీలూ ఈ పనిచేశాయి. 

వాటి ఆధారంగా ఓటర్లకు నోటీసులీయటం, పత్రాలు తీసుకురావాలని ఆదేశించటం, తీరా నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్‌ లేని (అన్‌మ్యాప్‌డ్‌) సంగతి బయటపడటం, పేర్లలో అక్షరక్రమం కొంచెం తేడావచ్చినా అనర్హులుగా జమవేయటం సాధారణ ఓటర్లకు తలనొప్పిగా మారింది. చిత్రమేమంటే ఒక బీజేపీ నాయకురాలి పేరుమీద దాఖలైన ఫిర్యాదుల సంగతి అధికారులు చెబితేగానీ ఆమెకు తెలియలేదు. దొంగ ఫిర్యాదులపైనా, వాటి ఆధారంగా నిర్ణయం తీసుకున్న వారి పైనా వెనువెంటనే చర్యలుంటే ఈ అరాచకం ఆగేది. కానీ దానికి సమయం పడుతుంది. 

బంగ్లాదేశ్‌కు పొరుగున ఉండటం బెంగాల్‌ ముస్లింలకు తలనొప్పిగా మారింది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవారు కూడా అక్రమ వలసదారులన్న ఫిర్యాదులతో అందు కవసరమైన పత్రాలు సేకరించలేక, పత్రాలున్నా పరిశీలనలో పేర్లలో కనబడిన స్వల్ప తేడా వల్ల జాబితాల నుంచి గల్లంతైనవారు అనేకులు. ఇలాంటి సమస్యలుంటాయని ఎన్నికల సంఘం ముందే అంచనా వేసి, తరుణోపాయం సూచిస్తే ప్రజలు న్యాయ స్థానాలకెక్కే అవసరం ఉండకపోయేది. 

కానీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదులపై ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా మిగిలిపోయిన ఎన్నికల సంఘం ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది? నిజమైన ఓటర్లకు సత్వరన్యాయం లభించాలని కోరుకోవటం మినహా ఎవరూ చేయగలిగింది లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement