ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు.
ఇప్పటికే బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్‌లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు.
రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్‌పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్‌కు రోమ్‌పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్‌కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి.
నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్‌పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం.
యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.
యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్‌తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే!


