అక్షరాలా ఉగ్రవాద చర్య | Sakshi Editorial On America, Israel, Iran | Sakshi
Sakshi News home page

అక్షరాలా ఉగ్రవాద చర్య

Mar 6 2026 1:10 AM | Updated on Mar 6 2026 1:10 AM

Sakshi Editorial On America, Israel, Iran

ఒకపక్క చర్చలు సాగుతుండగా అన్ని రకాల నీతి నియమాలనూ కాలదన్ని ఇరాన్‌పై దండయాత్ర ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల దిగజారుడుతనం ఉన్నకొద్దీ మితిమీరుతోంది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్ర జలాల్లో 130 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఇరాన్‌ యుద్ధనౌక ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’పై జలాంతర్గామి ద్వారా దొంగదెబ్బ తీసి 92 మంది నావికుల మృతికి కారణం కావటం ఆ వరస లోనిదే. భారత నావికాదళం ఆహ్వానంపై విశాఖలో ‘మిలన్‌–2026’ నావికాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెడుతుండగా ఈ దాడి జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి అణు జలాంతర్గామి ద్వారా టార్పెడోను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశామని అమెరికా సంబరంగా ప్రకటించుకుందిగానీ... ఈ చర్య అనేక విధాల ఖండనార్హమైనది. భద్రతా మండలిలో రష్యా, చైనాలు చెప్పినట్టు ‘అంతర్జాతీయ ఉగ్రవాద చర్య’. ఆ రెండు దేశాల వల్లా ఉద్రిక్తతలు పెరగటం ఒక్కటే కాదు... ఆ బాంబులు, క్షిపణుల్లో వాడే రసాయనాల వల్ల పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుంది. ధ్వంసమైన నౌక నుంచి లీకవుతున్న చమురు వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని శ్రీలంక వ్యక్తం చేస్తున్న ఆందోళన కూడా సహేతుకమైనది.  

ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి ఆ నౌక వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశాలకుండే సార్వభౌమత్వం వాటికి సంబంధించిన నౌకలకు సైతం వర్తిస్తుంది. ముఖ్యంగా ఘర్షణ ప్రాంతాల్లో కాక ప్రశాంత జలాల్లో పయనించే సైనిక నౌకలను ‘నిరపరాధ’ నౌకలంటారు. ముందస్తు సమాచారంతో వెళ్లే ఆ నౌకలపై ఎవరూ దాడి చేయరు. ప్రాదేశిక సముద్ర ప్రాంతం, దాని చేరువ ప్రాంత జలాల్లో వెళ్లే యుద్ధ నౌకల విషయంలో పాటించాల్సిన నీతిపై 1958లో అంతర్జాతీయ ఒడంబడిక కుదిరింది. దానిపై అందరితోపాటు అమెరికా కూడా సంతకం చేసింది. దాన్ని బేఖాతరు చేయటం దానికదే పెద్ద నేరం. 

ఇదెక్కడి రణనీతి? మన ఆహ్వానంపై వచ్చి వెడుతున్న అతిథి వంటిది ఆ నౌక. మన మిత్రదేశంగా ఉంటూ మన సంప్రదాయాలను ఉల్లంఘించి దానిపై దాడి చేయటం అమెరికా అమిత్ర చర్య. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతి మండలంగా ఉంచాలని దశాబ్దాలుగా మన దేశం చేస్తున్న కృషికి తూట్లు పొడవటం కూడా! మనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అణు జలాంతర్గామిని ఇటువైపు పంపడం ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒడంబడిక రీత్యా కూడా అత్యంత దారుణమైనది. 2021లో కూడా ఎలాంటి సమాచారమూ లేకుండా లక్షద్వీప్‌ సమీపంలో అమెరికా నావికా విన్యాసాలకు తెగబడింది. అందుకే భారత నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ చెప్పినట్టు ఇది మన సరిహద్దుల్లోకి యుద్ధాన్ని విస్తరింపజేయటంతో సమానం. కనుక అమెరికాకు మన అసంతృప్తిని తెలియజేయటం అత్యంత అవశ్యం. 

మిలన్‌ అంటే స్నేహపూర్వక కలయిక లేదా సమ్మేళనం. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు మన దేశం ఆ పేరు పెట్టడంలోనే సుహృద్భావం, సహకారం, ఐక్యత ధ్వనిస్తున్నాయి. అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ సముద్ర జలాల భద్రత కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నది ఈ సమ్మేళనం ఆంతర్యం. అన్నిటికన్నా ముఖ్యం– ప్రశాంత జలాల్లో ఇటువంటి దాడి జరిగితే గాయాల పాలైన నావికాదళ సభ్యుల్ని కాపాడటానికి ప్రయత్నించాలన్నది అన్ని దేశాల నావికా దళాలు పాటించే అలిఖిత నియమం. ఈ ఘనకార్యం తర్వాత అమెరికా జలాంతర్గామి కనీసం అక్కడ అర క్షణమైనా నిలబడే ప్రయత్నం చేయకుండా పరారైన తీరు సిగ్గుచేటైనది.

అంతర్జాతీయ చట్టాలతోపాటు స్వదేశీ చట్టాలను కూడా ఉల్లంఘించి యుద్ధం మెదలెట్టిన ట్రంప్‌ తాను ఎవరికీ జవాబుదారీ కాదనుకుంటున్నారు. దీన్నెవరూ అంగీకరించకూడదు. అమెరికా, ఇజ్రాయెల్‌ల తప్పుడు చర్య వల్ల పశ్చిమాసియా రణరంగంగా మారి ఎగుమతులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో నెల్లాళ్లవరకే వంటగ్యాస్‌ నిల్వలున్నాయంటున్నారు. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ రెండు దేశాల తప్పుడు చర్యను ఖండించటానికి ప్రభుత్వాలు సంశయిస్తున్న వేళ ఆ దేశాల ప్రజలతో సహా ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసిస్తే తప్ప ఈ దుండగం ఆగదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement