అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్‌ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్‌పై ఇంకా ఆపరేషన్ ముగియలేదన్నారు.
మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్‌కుమార్, దిలీప్ సింగ్ మృతిచెందారు.
ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు.


