మూడోసారి.. ప్రయోగించిన 69 సెకన్లకే పేలిపోయిన జపాన్‌ రాకెట్‌ | Japan's private rocket explodes in mid-air for the third time in a row | Sakshi
Sakshi News home page

మూడోసారి.. ప్రయోగించిన 69 సెకన్లకే పేలిపోయిన జపాన్‌ రాకెట్‌

Mar 5 2026 3:21 PM | Updated on Mar 5 2026 3:30 PM

Japan's private rocket explodes in mid-air for the third time in a row

టోక్యో: జపాన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ వన్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఆ సంస్థకు చెందిన కైరోస్ నం.3 రాకెట్‌ ప్రయోగించిన 69 సెకన్ల తర్వాత గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం వరుసగా మూడోసారి. ప్రైవేటు రంగంలో అంతరిక్ష రంగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న జపాన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ.

కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పని చేస్తుంది. దాని ఎత్తు 18 మీటర్లు. పశ్చిమ జపాన్‌లోని స్పేస్‌పోర్ట్ కీ అనే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఇవాళ ఉదయం 7:40 గంటలకు జరిపారు.

రాకెట్ నిర్వహణ బాధ్యత జపాన్ సంస్థ స్పేస్ వన్‌ది. ఇందులో 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి. టోక్యోకు చెందిన ఆర్క్ ఎడ్జ్ స్పేస్ సంస్థ తయారు చేసిన పరికరాలు, తైవాన్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాకెట్ విజయవంతంగా ఎగిరినప్పటికీ కొద్ది సమయంలోనే పేలిపోయింది. అందువల్ల కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. ప‍్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ అస్థిర మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రం పైభాగంలో 29 కిలోమీటర్ల ఎత్తులో దాని ప్రయాణం ఆటోమేటిక్‌గా ముగిసింది.

స్పేస్ వన్ ఉపాధ్యక్షుడు నోబుహిరో సెకినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయోగం ప‍్రారంభించిన సమయంలో, రాకెట్ పరికరాల్లో తమకేమీ లోపాలు కనిపించలేదని తెలిపారు. అయితే, ఆటోనొమస్‌ టెర్మినేషన్‌ సిస్టమ్‌ వ్యవస్థలో లోపం జరిగి ఉండవచ్చని చెప్పారు.

వరుసగా మూడో వైఫల్యం
స్పేస్ వన్ కైరోస్ రాకెట్‌కు ఇది వరుసగా మూడో వైఫల్యం. ఇదే రాకెట్ 2024లో జరిగిన రెండు ప్రయోగాల్లో కూడా విఫలమైంది. స్పేస్ వన్ సంస్థ జపాన్ కంపెనీల సంయుక్త ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కానన్, ఏరోస్పేస్ సంస్థ ఐహెచ్ఐ, నిర్మాణ సంస్థ షిమిజు వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

గత ఏడాది జపాన్ మొత్తం 3 రాకెట్ ప్రయోగాలు మాత్రమే చేసింది. 2030 నుంచి ప్రతి సంవత్సరం 30 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, ఆ దిశగా విజయాలు సాధించడం లేదు.

రక్షణ అవసరాలు పెరుగుతున్న పరిస్థితి, చైనా అంతరిక్ష ప్రోగ్రాం వేగంగా విస్తరించటం కారణంగా జపాన్‌పై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా రాకెట్లు అభివృద్ధి చేసి అమెరికా రాకెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని జపాన్ ప్రయత్నిస్తోంది.  

ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ వన్ సహా దేశీయ రాకెట్ స్టార్టప్ సంస్థలకు మిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇచ్చింది. ఇప్పటివరకు జపాన్‌లో ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాణిజ్య రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేయలేకపోయింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో స్పేస్ వన్ ఇంకా ప్రకటించలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement