పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే? | What Is a Blood Chit Linked to US F-15E Shootdown in Kuwait | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?

Mar 5 2026 1:04 PM | Updated on Mar 5 2026 1:13 PM

What Is a Blood Chit Linked to US F-15E Shootdown in Kuwait

న్యూఢిల్లీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మార్చి 1న రాత్రి 11.03 గంటలకు కువైట్ గగనతలంలో కుప్పకూలాయి. ఈ ఘటన ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీకి సంబంధించిన యుద్ధ చర్యల సమయంలో జరిగింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేస్తున్న సమయంలో కువైట్ గగనతలరక్షణ వ్యవస్థలే పొరపాటుగా అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ ఘటన తర్వాత ‘బ్లడ్ చిట్’ అనే చిన్న నోటీసుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతోంది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాల పైలట్లే  ‘బ్లడ్ చిట్’ను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.


వైరల్‌ అవుతున్న బ్లడ్ చిట్‌లో ఏముంది?
అమెరికన్ పైలట్లు తమ జాకెట్ల లోపల ఈ బ్లడ్ చిట్‌ను కుట్టుకుని మరీ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్, అరబిక్, టర్కిష్, పర్షియన్, కుర్దిష్ భాషలలో అందులో సందేశం ఉంది. "నేను అమెరికన్‌ని. నాకు మీ భాష రాదు. నేను మీకు ఎటువంటి హాని చేయను. దయచేసి నాకు ఆహారం, నీరు, ఆశ్రయం, దుస్తులు అందించి వైద్య సాయం అందేలా చేయండి. అమెరికన్ లేదా మా మిత్ర దేశాల దళాల వద్దకు చేరుకోవడానికి నాకు సాయం చేయండి. మీరు నా పేరు, ఈ నంబర్‌ను అమెరికా అధికారులకు అందిస్తే, మీకు బహుమతి లభిస్తుంది" అని బ్లడ్ చిట్‌లో ఉంది. అయితే, ఈ బ్లడ్ చిట్‌ నిజంగా అమెరికా దళాలకు చెందిందేనా? అన్న విషయంపై అధికారికంగా ఎటువంటి నిర్థారణ లేదు. అయినప్పటికీ బ్లడ్ చిట్‌లు పెట్టుకెళ్లడం అమెరికా దళాలకు అలవాటే.

బ్లడ్ చిట్ అంటే ఏంటి?
బ్లడ్ చిట్ అనేది చిన్న నోటీసు. యుద్ధ సిబ్బంది, ముఖ్యంగా వైమానిక దళ సిబ్బంది తమ వద్ద దీన్ని పెట్టుకుంటారు. సాధారణ పౌరులను ఉద్దేశించి దీన్ని రాసిపెట్టుకుంటారు. తనకు సాయం అందించాలని అభ్యర్థిస్తూ ఓ సందేశాన్ని అందులో రాస్తారు. యుద్ధ విమానం కూలిపోతే లేదా ఏదైనా ప్రాంతంలో చిక్కుకుపోతే అక్కడి సాధారణ ప్రజలకు దీన్ని చూపిస్తారు. సైనికుడికి అక్కడి భాష రాకపోవచ్చు.

దీంతో బ్లడ్ చిట్‌ను సాధారణంగా అనేక భాషల్లో ముద్రిస్తారు. దాన్ని చూపిస్తున్న వ్యక్తి మిత్ర దేశానికి చెందిన సైనికుడని అందులో ఉంటుంది. ఆ వ్యక్తికి ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్య సాయం అందించాలని అందులోనే ముందుగానే రాసి పెట్టుకుంటారు. తనకు సాయం చేసి సురక్షితంగా తిరిగి పంపితే తమ దేశ ప్రభుత్వం ప్రతిఫలం ఇస్తుందన‍్న హామీ కూడా అందులో రాసి ఉంటుంది.

 

“బ్లడ్ చిట్” అనే పదం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ సమయంలో చైనా, బర్మా సహా ఆసియా ప్రాంతాల్లో అమెరికా వైమానిక సిబ్బంది తమ జాకెట్ వెనుక భాగంలో బ్లడ్ చిట్ కుట్టించుకునేవారు. అమెరికా జెండా ముద్రించి, స్థానిక భాషల్లో సందేశం రాసి బ్లడ్‌ చిట్‌ ఉండేది.

Advertisement
 
Advertisement
Advertisement