మరో కలకలం.. అణు సామర్థ్యం ఉన్న క్షిపణి పరీక్ష నిర్వహణ | US tests nuclear-capable Minuteman III doomsday missile as Iran war rages | Sakshi
Sakshi News home page

మరో కలకలం.. అణు సామర్థ్యం ఉన్న క్షిపణి పరీక్ష నిర్వహణ

Mar 5 2026 11:55 AM | Updated on Mar 5 2026 12:25 PM

US tests nuclear-capable Minuteman III doomsday missile as Iran war rages

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం ఆరో రోజుకు చేరుకున్న వేళ అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మినిట్‌మన్ 3 “డూమ్స్‌డే” ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షా ప్రయోగాన్ని నిర్వహించింది అమెరికా. హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే 20 రెట్లు ఎక్కువ శక్తి ఉండే వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది.

గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆయుధాలులేకుండా మినిట్‌మన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది అమెరికా వైమానిక దళం. ఇందులో రెండు టెస్ట్‌ రీ-ఎంట్రీ వాహనాలు అమర్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. రీ-ఎంట్రీ వాహనం అంటే గగనతలం నుంచి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో వార్‌హెడ్‌ను రక్షించే ప్రత్యేక కవచ వ్యవస్థ.

ఈ క్షిపణిని టెస్ట్‌ వెహికిల్‌ జీటీ-255గా అమెరికా స్పేస్ ఫోర్స్ పిలుస్తుంది. అయితే, తాజాగా చేసిన పరీక్ష చాలా కాలంగా కొనసాగుతున్న రొటీన్‌ ప్రోగ్రాంలో భాగమని అమెరికా స్పేస్ ఫోర్స్ అంటోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులతో దీనికి అధికారికంగా సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది.

గత కొన్ని దశాబ్దాల్లో 300కు పైగా ఇలాంటి ప్రయోగాలు జరిగాయని అమెరికా స్పేస్ ఫోర్స్ తెలిపింది. భూభాగ ఆధారిత అణు నిరోధక వ్యవస్థ విశ్వసనీయత, కచ్చితత్వం, సన్నద్ధత నిర్ధారణే లక్ష్యంగా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్షిపణి వేల మైళ్లు ప్రయాణించి, పశ్చిమ-మధ్య మహాసముద్రంలోని మార్షల్ దీవుల సమీపంలోని టార్గెట్‌ ప్రాంతాన్ని విజయవంతంగా ఛేదించింది.

వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలో కీలకం 
జీటీ 255 ద్వారా క్షిపణి వ్యవస్థలోని భాగాల పనితీరును అంచనా వేయగలిగామని ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్ లెఫ్టినెంట్ కర్నల్ కేరీ రే చెప్పారు. “వివిధ మిషన్ ప్రొఫైళ్లను నిరంతరం పరిశీలించడం ద్వారా మొత్తం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పనితీరును మెరుగుపరచగలుగుతున్నాం. అణు త్రయం సన్నద్ధత మెరుగ్గా ఉండేలా ఇది సాయపడుతుంది” అని తెలిపారు. అణు త్రయం అంటే భూమి, సముద్రం, గగనం నుంచి అణ్వాయుధాలు ప్రయోగించే మూడు విధాల సైనిక వ్యవస్థ.

మినిట్‌మన్ 3 అమెరికా వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలో ప్రధాన భాగం. దీని పరిధి సుమారు 6,000 మైళ్లు. గంటకు 15,000 మైళ్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. దీంతో ఖండాల మధ్య లక్ష్యాలను కొన్ని నిమిషాల్లో చేరుకుంటుంది. శత్రు దేశాలు అణు దాడి చేయకుండా వాటిని భయపెట్టే సామర్థ్యం గల వ్యూహాత్మక అణు ఆయుధ వ్యవస్థ ఇది. చివరిసారిగా మినిట్‌మన్ 3 పరీక్ష 2025 నవంబరులో జరిగింది. అణు సన్నద్ధతపై వాషింగ్టన్‌లో చర్చలు మళ్లీ పెరిగిన సమయంలో ఈ పరీక్ష జరిగింది.

పశ్చిమాసియాలో యుద్ధం 6వ రోజుకి చేరిన వేళ గురువారం ఇజ్రాయెల్ వైపుగా ఇరాన్ క్షిపణులతో వరుసగా దాడులు ప్రారంభించింది. దీంతో లక్షలాది మంది సురక్షిత కేంద్రాలకు పరుగులు తీశారు. ప్రధాన నగరాల్లో సైరన్లు మార్మోగాయి.  దౌత్య ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement