అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్ తేల్చి చెప్పింది.
హర్మూజ్ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.
కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.
మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.


