ప్రకృతి వర్ణభరితంగా ఉంటుంది. వసంతాగమన వేళ చెట్టు చేమలు హరితహాసాలు చిందిస్తాయి. చెట్లకు, మొక్కలకు పూచే పువ్వులు రకరకాల రంగులతో కనువిందు కలిగిస్తాయి. నేల మీద మట్టిలోనూ రకరకాల వన్నెలు కనిపిస్తాయి. ప్రతిరోజూ పొద్దుపొడుపు నుంచి పొద్దుగూకే లోపు నీలాకాశం కూడా వన్నెలు మారుతూ ఉంటుంది. నింగిలో ఎగిరే పక్షులు, నేల మీద సంచరించే జీవులు నానా రంగుల్లో ఉంటాయి. వర్షర్తువులో ఆకాశంలో మెరిసే ఇంద్రచాపం సప్తవర్ణాలతో అలరిస్తుంది. దేశదేశాల్లోని మనుషుల్లోనూ వర్ణవైవిధ్యం కనిపిస్తుంది. జీవవైవిధ్యమే కాదు, అందులోని వర్ణవైవిధ్యమూ ప్రకృతి సహజ లక్షణం. నేలకూ నింగికీ నడుమ కనిపించే వన్నెచిన్నెలే ప్రకృతి చేవ్రాలు.
ఒకవేళ రంగులే లేకుంటే, ప్రకృతి ఎంత నిస్సారంగా ఉండేది! ఒకవేళ అన్నీ ఏకవర్ణంలోనే ఉంటే, ప్రకృతి ఎంత నిర్లిప్తంగా ఉండేది! వర్ణహీనత అయినా, ఏకవర్ణ పరివ్యాప్తి అయినా ప్రకృతికి స్వభావ విరుద్ధాలు. వర్ణవైవిధ్యాన్ని పండుగ చేసుకోవడానికి వసంతోత్సవం లాంటి వేడుకలు మొదలయ్యాయి. ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం ఒక సామూహిక వినోదమే కాదు, వైవిధ్యానికి ఆమోదం కూడా! రుతువులు మారినప్పుడల్లా ప్రకృతి తన వర్ణాలను మార్చుకుంటుంది. ప్రకృతి తన భావోద్వేగాలను వర్ణలిపిలో వ్యక్తం చేస్తుంది. ‘రంగులు కూడా స్వభావాల మాదిరి గానే భావోద్వేగాలను అనుసరిస్తాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. రంగుల మర్మం చిత్రకారులకెరుక, కవులకెరుక!
‘కాలమనియెడు చిత్రకారుండు గీచినవి / ఆరు ఋతువుల శబల చిత్రాల వృత్త / నర్తనమ్మిది ఋతువైభవ శ్రేణి దీప్తు / లలర చక్రమాగక నిరతము తిరుగుచుండు’ అన్నారు సాంధ్యశ్రీ. వైవిధ్యం ప్రకృతి స్వభావం. వైవిధ్యం ప్రజాస్వామిక లక్షణం. ‘వైవిధ్యంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. నిరంకుశత్వం వైవిధ్యాన్ని వ్యతిరేకిస్తుంది’ అని అమెరికన్ దౌత్యవేత్త సామ్ బ్రౌన్‌బ్యాక్ అన్నారు. ప్రకృతిలో మనుషులూ భాగమే! ప్రకృతిలోని వైవిధ్యమంతా మనుషుల్లోనూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో లెక్కకు మిక్కిలి భాషలు ఉన్నాయి; రకరకాల సంస్కృతులు ఉన్నాయి; మనుషులు సృష్టించిన కళలలో అనేకానేక శైలీభేదాలు ఉన్నాయి. వైవిధ్యమే లేకుంటే, మానవ సృజనకు ఆస్కారమెక్కడ? వైవిధ్యమే లేకుంటే మన జీవితాలు ఎంత నిస్సారంగా మారిపోతాయో ఊహించు కోగలమా?
అనాదిగా మానవాళి వైవిధ్యాన్ని ఆమోదిస్తూనే ఉంది. అందుకు నిదర్శనమే హోలీ వంటి వసంతోత్సవాలు. హోలీ పండుగ గురించిన పురాణగాథలు ఎలా ఉన్నా, ఇది వైవిధ్యాన్ని వేడుక చేసుకునే రంగుల పండుగ. హోలీ వంటి పండుగలు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రీస్ దేశంలో జరుపుకొనే ‘ఫ్లోర్ వార్’ తీరు దాదాపు హోలీ మాదిరిగానే ఉంటుంది. ఈ వేడుకలో జనాలంతా వీథుల్లోకి చేరి, రంగులు కలిపిన పిండిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇరాన్‌లో జరుపుకొనే ‘చహార్‌శంబే సూరీ’ పండుగలో కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. గ్రీస్, ఇరాన్ దేశాల్లో కూడా ఈ రంగుల పండుగలను వసంతారంభంలోనే జరుపుకొంటారు.
ప్రకృతిలోనే వైవిధ్యం ఉన్నప్పుడు మనుషుల్లోని వైవిధ్యాన్ని ఆమోదించడానికి శషభిషలు పడటంలో అర్థంలేదు. అయినా, కొందరికి వైవిధ్యం నచ్చదు. ప్రపంచమంతా తమ తీరులోనే ఉండాలనే మంకుపట్టు వారిది. ఇలాంటి మొండిశిఖండులకు దేశాధి కారం చేతికొస్తే, ప్రజలకు నిత్యనరకం తప్పదు. ఉదాహరణకు ఉత్తర కొరియానే తీసు కుందాం. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో అక్కడ నెత్తిమీద జుట్టు కత్తిరించుకునే తీరుకూ పరిమితులు ఉన్నాయి.
ప్రభుత్వామోదానికి భిన్నమైన తీరులో నెత్తిమీద జుట్టు పెంచుకుంటే, అక్కడ అంతే సంగతులు! వైవిధ్య వ్యతిరేక ధోరణులు ఇప్పుడు ప్రపంచ మంతటా ప్రబలుతున్నాయి. ఆహార, ఆచార, ఆలోచనా వైవిధ్యాలను విభేదాలుగా పరిగణించి, అసహనానికి ఆజ్యంపోసే శక్తులు కల్లోలాలను రెచ్చగొడుతున్నాయి. జీవ వైవిధ్యాన్నే కాదు, మానవాళిలోని సమస్త వైవిధ్యాలను కాపాడుకుంటేనే అది అసలైన వసంతోత్సవం కాగలదు; అదే అసలైన రంగుల పండుగ కాగలదు.


