కథలన్నీ కంచికి చేరతాయో లేదోగానీ... రాజకీయ ప్రయోజనాలనాశించి పెట్టే కేసులన్నీ, సీబీఐ, ఈడీల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఆ వరసలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తాజా ఉదాహరణ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతోపాటు 23 మందిపై అవినీతి, కుంభకోణం ఆరోపణలు చేస్తూ 2022లో సీబీఐ దాఖలు చేసిన కేసులో అందరూ నిర్దోషులని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సీబీఐకి చెంపపెట్టు. పనిలో పనిగాతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆమె సైతం ఇప్పుడు నిర్దోషిగా తేలారు.
2021లో ఢిల్లీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూరేలా మద్యం విధానం తీసుకొచ్చిందంటూ ఈ కేసు అల్లారు. అధికారంలో కొచ్చిన ఏ రాజకీయ పక్షమైనా అమల్లో ఉన్నవాటిని కాదని, తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతుంది. అవన్నీ సరైనవి కాకపోవచ్చు. వాటి వెనక స్వీయ ప్రయోజనాలుండొచ్చు. ఆ నిర్ణయాల పర్యవసానంగా ఖజానా నష్టపోతే, ప్రజల ప్రయో జనాలు దెబ్బతింటే చర్యలు తీసుకోవాల్సిందే. వాటినెవరూ ప్రశ్నించరు.
కానీ అందుకు తగిన మౌలిక ఆధారాలు, ప్రాతిపదిక ఉండాలి. విధానం మార్చడం దానికదే ఒక కుంభ కోణంగా చిత్రించటం, ఆ పేరిట కేసులు, అరెస్టులతో వేధించటం, ఏళ్ల తరబడి దర్యాప్తు, చివరకు నిరూపించలేక న్యాయస్థానాలతో చీవాట్లు తినడం ఏం మర్యాద? ఇందువల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతినడం లేదా? తాత్కాలికంగా మీడియాలో భారీ యెత్తున ప్రచారం జరగొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదని జనం అభిప్రాయపడేలా చేయొచ్చు. ఎన్ని చేసినా ఆరోపణల్ని రుజువు చేయటం అంతిమంగా దర్యాప్తు సంస్థ బాధ్యత.
పత్రికల్లో రోజుల తరబడి పతాక శీర్షికలు ఆక్రమించి, టీవీ చానెళ్లలో గంటల తరబడి చర్చలకు కారణమైన కేసులు చివరకు దూదిపింజెల్లా తేలిపోవటం, గాలి పోగేయటం తప్ప ఇందులో ఆవగింజంతైనా వాస్తవం లేదని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసుల్ని ఆధారం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు ఇష్టానుసారం వ్యాఖ్యా నాలు చేయటం, అవమానించేలా శీర్షికలు పెట్టడం మరో ప్రహసనం.
ఎవరికీ తెలియని ‘సౌత్ గ్రూప్’ను సృష్టించి, దానికి లబ్ధి కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చిందని, ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియానూ, 2024 మార్చిలో కవితనూ, కేజ్రీవాల్‌నూ అరెస్టు చేశారు.
అన్ని కేసుల్లో మాదిరే ఇక్కడ కూడా మనీశ్ సన్నిహితుడు దినేశ్ అరోరా, ఏపీకిచెందిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వంటివారిని అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఈ ముగ్గురూ పూసగుచ్చినట్టు చెప్పారంటూ లీకులిచ్చారు. కానీ అలా అంటే సరిపోదు... వాటిని ధ్రువపరిచే సాక్ష్యాలుండాలి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తే కాదు... అంత మొత్తం ఎలా ప్రయాణించిందో, ఏయే ఖాతాలకు మళ్లిందో చూపాలి. అడుగడుగునా ఆధారాలుండాలి.
ఫలానా అంశాలు రాబట్టామని ఏకరువు పెట్టినంత మాత్రాన కుదరదు. వాటిమధ్య పరస్పర సంబంధాన్ని సందేహాతీతంగా రుజువు పరచాలి. ఆ సంగతలా ఉంచి కనీసం అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, 13 కింద ఆరోపించిన లంచం ఆరోపణల్ని కూడా సీబీఐ ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. అందుకే కాబోలు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యకు కోర్టు ఆదేశించింది.
అయితే ఈ కేసులో సీబీఐ అప్పీలుకెళ్లింది. అంటే ఈడీ దర్యాప్తు ఇంకా సాగుతూనేఉంటుందనుకోవాలి. కాకపోతే ఇందులో అవినీతిపరుడిగా ముద్రపడిన కేజ్రీవాల్‌నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. నిందితులంతా కారాగారవాసంతో సహా మూడున్నరేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. బహుశా వారిని ఆర్థికంగా కూడాకుంగదీసి ఉండొచ్చు. కానీ దర్యాప్తు పేరిట ప్రజాధనం, న్యాయస్థానాల విలువైన సమయం వృథా కావటం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు కొనసాగనీయటం అవాంఛనీయం, ప్రమాదకరం.


