పాఠ్యపుస్తకాల్లో కొన్నిటిని తొలగించటం, మార్చటం... అవి వివాదాస్పదం కావటం గత కొన్నేళ్లుగా కనబడుతోంది. కానీ ఈసారి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి పిల్లల కోసం కొత్తగా విడుదల చేసిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ఏకంగా న్యాయవ్యవస్థపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ వైనంపై మీడియాలో కథనం రావటం, వెనువెంటనే సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించి నోటీసులు జారీచేయటం వంటి పరిణామాలతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు సంస్థ హడావిడిగా ప్రకటించింది. అసలు దీన్ని వెలువరించటంలోనే బోలెడంత బాధ్యతా రాహిత్యం కనబడుతుంది.
ఈ పుస్తకం తాలూకు తొలి భాగం గత జూలైలో విడుదలైంది. వివాదాస్పదమైన ఈ రెండో భాగం విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా తీరిగ్గా సోమవారం విడుదలైంది. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేయటమైనా, స్వల్ప వ్యవధిలో అవగాహన చేసుకుని పిల్లలు పరీక్ష రాయటమైనా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు జాతీయ పాఠ్య ప్రణాళిక అమరిక(ఎన్‌సీఎఫ్) మార్గదర్శకాల పరిధిలో రూపొందగా, కొత్త పాఠ్య పుస్తకాలకు 2020లో కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) ఆధారం.
పాఠ్య పుస్తకాల రచన తాడుపై నడక వంటిది. ఆ విన్యాసం తొట్రు పడకుండా,తొందర లేకుండా, అడుగడుగూ అంచనా వేసుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి. సమ తౌల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. సమాచారాన్ని పోగేయటం పాఠ్యరచన అనిపించుకోదు. తాము ఏ తరగతి పిల్లల కోసం రచిస్తున్నామో, వారి వయసెంతో, మానసిక స్థాయి ఏమిటో అవగాహన ఉండాలి. నిష్పాక్షికత దాని ప్రాణం కావాలి. వాస్తవాన్ని ప్రతిబింబించే గణాంకాలను ఆధారంగా చేసుకోవాలి.
మతం, కులం, జెండర్ వగైరా అంశాల్లో సున్నితంగా ఆలోచించాలి. సందర్భ శుద్ధి లేని ఉటంకింపులు తప్పుడు అభిప్రాయం కలిగిస్తాయన్న ఎరుక ఉండాలి. కానీ ఈ పాఠ్యాంశ రచనలో అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్నట్టు కనబడుతోంది. అది చదివితే వస్తునిష్ఠ కన్నా స్వీయ ఆలోచనలకూ, అభిప్రాయాలకే ప్రాధాన్యమిచ్చారన్న సంశయం కలుగుతుంది.
అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి జాడ్యాలు న్నాయి. అదే సమయంలో వాటిని ప్రక్షాళన చేసేందుకు అంతర్గత దిద్దుబాటు యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. తమ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవటం కన బడుతుంది. అవి చాలినంతగా లేకపోవచ్చు. వాటిని నిష్పాక్షిక దృష్టితో చర్చిస్తే వేరుగా ఉండేది. కానీ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మాటెత్తకుండా న్యాయ వ్యవస్థ మాత్రమే ఇలాంటి క్లేశాలతో నిండివున్నదని చెప్పడం విద్యార్థుల్లో ఎలాంటి అభిప్రాయం కలగ జేస్తుందన్న ఆలోచన పాఠ్య రచయితలకు లేకుండా పోయింది.
రాజ్యం ఏ విధంగా పని చేస్తుంటుందో, భిన్న వ్యవస్థలు ఏ పరమార్థం కోసం ఏర్పడ్డాయో పన్నెండేళ్ల పిల్లలకు చెప్పవలసి ఉండగా న్యాయవ్యవస్థ ఒక్కదాని గురించే చర్చిస్తూ అది అవినీతిమయం అయిందనీ, దిద్దుబాటు చర్యలు లేనేలేవన్న అభిప్రాయం కలగజేస్తే పిల్లల్లో ఒక విధమైన నిరాశకు దారితీయదా? ఆ పుస్తకాన్ని పిల్లలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులు సైతం చదువుతారు. ఇష్టానుసారం రచించిన ఇలాంటి పాఠ్యాంశాలు అంతిమంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ కలిగిస్తాయని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించటం ఇందువల్లనే!
ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పనితీరైనా పరిశీలనకూ లేదా విమర్శకూ అతీతం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం కించపరచాలని చూడటం క్షమార్హం కాదు. నిజానికి న్యాయవ్యవస్థకు సంబంధించి ఇంతవరకూ ఉన్న పాఠ్యాంశం అది పనిచేసే తీరునూ, ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి అది చేస్తున్న కృషినీ అందుకుసంబంధించిన కేసుల ప్రస్తావనతో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఆ వ్యవస్థకెదురవుతున్న సవాళ్లను వివరించింది. దాన్ని అపభ్రంశం చేయటం తప్ప కొత్త పాఠ్యాంశం సాధించిందేమిటి? జవాబుదారీతనం లేకుండా, చిత్తశుద్ధి కలికానికైనా కనబడకుండా చేసే రచనలు అనర్థదాయకమని ఇప్పటికైనా ఎన్‌సీఈఆర్‌టీ తెలుసు కోవటం మంచిది.


