breaking news
Social science book
-
9వ తరగతి పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’
న్యూఢిల్లీ: దేశంలో 1975–77లో విధించిన అత్యవసర పరిస్థితిని 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు ఎన్సీఈఆర్టీ గురువారం ప్రకటించింది. ఎమెర్జెన్సీ అంశంపై 2007లోనే అప్పటి యూపీఏ అప్పటి ప్రభుత్వం 12వ తరగతికి పాఠ్యాంశంగా తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితి అంశాన్ని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చడం ఇదే మొదటిసారి. కొత్తగా రూపొందించిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ’అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ లోని ఒక పేరాలో.. ’భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. 1975–77 మధ్యకాలంలో విధించిన అత్యవసర పరిస్థితి. 1970ల ప్రారంభంలో ఇందిరా గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దుష్పరిపాలన అంశాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. 1975 జూన్లో, అంతర్గత అలజడుల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ కాలంలో ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై ఆంక్షలు విధించారు. వందలాది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు అమలయ్యాయి..’అని అందులో ఉంది. దీనిపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద ప్రధాన్ స్పందించారు..‘ఎన్సీఈఆర్టీ చాలా మంచి పని చేసింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలను భవిష్యత్ తరాల వారు తప్పక తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా జాగ్రత్త పడతారు. ఆ సదుద్దేశంతోనే ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంగా తీసుకువచ్చింది’అని పేర్కొన్నారు. పాఠ్య పుస్తకానికి ‘కృష్ణ’ పేరు సబబే: ఎన్సీఈఆర్టీ ఆరో తరగతిలో కన్నడ భాష బోధనకు కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకానికి కృష్ణ అనే పేరు పెట్టడంపై తలెత్తిన వివాదాన్ని ఎన్సీఈఆర్టీ తీవ్రంగా ఖండించింది. కృష్ణ అంటే కర్ణాటకల్లో ప్రధాన నదుల్లో ఒకటని, ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. పాఠ్యపుస్తకాల ద్వారా కాషాయీకరణకు ఎన్సీఈఆర్టీ ప్రయతి్నస్తోందంటూ కర్ణాటకకు చెందిన విద్యా హక్కుల సంఘం ఆరోపించింది. కన్నడ సాంస్కృతిక గుర్తింపును, మాంసాహార ప్రాధాన్యాన్ని తక్కువచేస్తూ మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. దీనిపై ఎన్సీఈఆర్టీ బదులిస్తూ.. నూతన విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల పాఠ్యపుస్తకాలన్నిటికీ దేశీయ నదుల పేర్లే పెట్టామంది. హిందీ పాఠ్యపుస్తకానికి గంగ అనీ, ఇంగ్లిష్ పుస్తకానికి కావేరి అనీ, అదేవిధంగా ఉర్దూ పాఠ్యపుస్తకానికి యమున అని పెట్టామంది. -
పాఠం – గుణపాఠం
పాఠ్యపుస్తకాల్లో కొన్నిటిని తొలగించటం, మార్చటం... అవి వివాదాస్పదం కావటం గత కొన్నేళ్లుగా కనబడుతోంది. కానీ ఈసారి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి పిల్లల కోసం కొత్తగా విడుదల చేసిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ఏకంగా న్యాయవ్యవస్థపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ వైనంపై మీడియాలో కథనం రావటం, వెనువెంటనే సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించి నోటీసులు జారీచేయటం వంటి పరిణామాలతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు సంస్థ హడావిడిగా ప్రకటించింది. అసలు దీన్ని వెలువరించటంలోనే బోలెడంత బాధ్యతా రాహిత్యం కనబడుతుంది. ఈ పుస్తకం తాలూకు తొలి భాగం గత జూలైలో విడుదలైంది. వివాదాస్పదమైన ఈ రెండో భాగం విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా తీరిగ్గా సోమవారం విడుదలైంది. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేయటమైనా, స్వల్ప వ్యవధిలో అవగాహన చేసుకుని పిల్లలు పరీక్ష రాయటమైనా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు జాతీయ పాఠ్య ప్రణాళిక అమరిక(ఎన్సీఎఫ్) మార్గదర్శకాల పరిధిలో రూపొందగా, కొత్త పాఠ్య పుస్తకాలకు 2020లో కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) ఆధారం. పాఠ్య పుస్తకాల రచన తాడుపై నడక వంటిది. ఆ విన్యాసం తొట్రు పడకుండా,తొందర లేకుండా, అడుగడుగూ అంచనా వేసుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి. సమ తౌల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. సమాచారాన్ని పోగేయటం పాఠ్యరచన అనిపించుకోదు. తాము ఏ తరగతి పిల్లల కోసం రచిస్తున్నామో, వారి వయసెంతో, మానసిక స్థాయి ఏమిటో అవగాహన ఉండాలి. నిష్పాక్షికత దాని ప్రాణం కావాలి. వాస్తవాన్ని ప్రతిబింబించే గణాంకాలను ఆధారంగా చేసుకోవాలి. మతం, కులం, జెండర్ వగైరా అంశాల్లో సున్నితంగా ఆలోచించాలి. సందర్భ శుద్ధి లేని ఉటంకింపులు తప్పుడు అభిప్రాయం కలిగిస్తాయన్న ఎరుక ఉండాలి. కానీ ఈ పాఠ్యాంశ రచనలో అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్నట్టు కనబడుతోంది. అది చదివితే వస్తునిష్ఠ కన్నా స్వీయ ఆలోచనలకూ, అభిప్రాయాలకే ప్రాధాన్యమిచ్చారన్న సంశయం కలుగుతుంది. అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి జాడ్యాలు న్నాయి. అదే సమయంలో వాటిని ప్రక్షాళన చేసేందుకు అంతర్గత దిద్దుబాటు యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. తమ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవటం కన బడుతుంది. అవి చాలినంతగా లేకపోవచ్చు. వాటిని నిష్పాక్షిక దృష్టితో చర్చిస్తే వేరుగా ఉండేది. కానీ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మాటెత్తకుండా న్యాయ వ్యవస్థ మాత్రమే ఇలాంటి క్లేశాలతో నిండివున్నదని చెప్పడం విద్యార్థుల్లో ఎలాంటి అభిప్రాయం కలగ జేస్తుందన్న ఆలోచన పాఠ్య రచయితలకు లేకుండా పోయింది. రాజ్యం ఏ విధంగా పని చేస్తుంటుందో, భిన్న వ్యవస్థలు ఏ పరమార్థం కోసం ఏర్పడ్డాయో పన్నెండేళ్ల పిల్లలకు చెప్పవలసి ఉండగా న్యాయవ్యవస్థ ఒక్కదాని గురించే చర్చిస్తూ అది అవినీతిమయం అయిందనీ, దిద్దుబాటు చర్యలు లేనేలేవన్న అభిప్రాయం కలగజేస్తే పిల్లల్లో ఒక విధమైన నిరాశకు దారితీయదా? ఆ పుస్తకాన్ని పిల్లలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులు సైతం చదువుతారు. ఇష్టానుసారం రచించిన ఇలాంటి పాఠ్యాంశాలు అంతిమంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ కలిగిస్తాయని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించటం ఇందువల్లనే! ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పనితీరైనా పరిశీలనకూ లేదా విమర్శకూ అతీతం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం కించపరచాలని చూడటం క్షమార్హం కాదు. నిజానికి న్యాయవ్యవస్థకు సంబంధించి ఇంతవరకూ ఉన్న పాఠ్యాంశం అది పనిచేసే తీరునూ, ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి అది చేస్తున్న కృషినీ అందుకుసంబంధించిన కేసుల ప్రస్తావనతో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఆ వ్యవస్థకెదురవుతున్న సవాళ్లను వివరించింది. దాన్ని అపభ్రంశం చేయటం తప్ప కొత్త పాఠ్యాంశం సాధించిందేమిటి? జవాబుదారీతనం లేకుండా, చిత్తశుద్ధి కలికానికైనా కనబడకుండా చేసే రచనలు అనర్థదాయకమని ఇప్పటికైనా ఎన్సీఈఆర్టీ తెలుసు కోవటం మంచిది. -
పాఠంలో పాత మ్యాపే!
తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో తెలంగాణ లేకుండానే దేశ పటం సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు దాటినా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్లక్ష్యం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. తొమ్మిదో తరగతి సెంట్రల్ సిలబస్ సోషల్ సైన్స్ పుస్తకంలోని భారతదేశ పటంలో తెలంగాణను రాష్ట్రంగా ముద్రించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ముద్రించారు. తొమ్మిదో తరగతి కాంటెంపరరీ ఇండియా–1 (జియోగ్రఫీ) పుస్తకంలో ఐదో పేజీలో ఇండియా అండ్ ఎడ్జేసేంట్ కంట్రీస్ పటం ఉంది. ఇందులో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చూపలేదు. ఎన్సీఈఆర్టీ 2006లో మొదటిసారిగా ఈ పుస్తకాన్ని ముద్రించింది. 2016లో పదోసారి రీప్రింట్ సమయంలో పుస్తకంలోని పటాల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఎన్సీఈఆర్టీ చూపకపోవడం పట్ల విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.


