ప్రకటించిన ఎన్‌సీఈఆర్‌టీ
అది చాలా మంచి చర్య
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: దేశంలో 1975–77లో విధించిన అత్యవసర పరిస్థితిని 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ గురువారం ప్రకటించింది. ఎమెర్జెన్సీ అంశంపై 2007లోనే అప్పటి యూపీఏ అప్పటి ప్రభుత్వం 12వ తరగతికి పాఠ్యాంశంగా తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితి అంశాన్ని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చడం ఇదే మొదటిసారి.
కొత్తగా రూపొందించిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ’అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ లోని ఒక పేరాలో.. ’భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. 1975–77 మధ్యకాలంలో విధించిన అత్యవసర పరిస్థితి. 1970ల ప్రారంభంలో ఇందిరా గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దుష్పరిపాలన అంశాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి.
1975 జూన్‌లో, అంతర్గత అలజడుల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ కాలంలో ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై ఆంక్షలు విధించారు. వందలాది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు అమలయ్యాయి..’అని అందులో ఉంది.
దీనిపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద ప్రధాన్ స్పందించారు..‘ఎన్‌సీఈఆర్‌టీ చాలా మంచి పని చేసింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలను భవిష్యత్ తరాల వారు తప్పక తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా జాగ్రత్త పడతారు. ఆ సదుద్దేశంతోనే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంగా తీసుకువచ్చింది’అని పేర్కొన్నారు.
పాఠ్య పుస్తకానికి ‘కృష్ణ’ పేరు సబబే: ఎన్‌సీఈఆర్‌టీ
ఆరో తరగతిలో కన్నడ భాష బోధనకు కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకానికి కృష్ణ అనే పేరు పెట్టడంపై తలెత్తిన వివాదాన్ని ఎన్‌సీఈఆర్‌టీ తీవ్రంగా ఖండించింది. కృష్ణ అంటే కర్ణాటకల్లో ప్రధాన నదుల్లో ఒకటని, ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. పాఠ్యపుస్తకాల ద్వారా కాషాయీకరణకు ఎన్‌సీఈఆర్‌టీ ప్రయతి్నస్తోందంటూ కర్ణాటకకు చెందిన విద్యా హక్కుల సంఘం ఆరోపించింది.
కన్నడ సాంస్కృతిక గుర్తింపును, మాంసాహార ప్రాధాన్యాన్ని తక్కువచేస్తూ మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. దీనిపై ఎన్‌సీఈఆర్‌టీ బదులిస్తూ.. నూతన విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల పాఠ్యపుస్తకాలన్నిటికీ దేశీయ నదుల పేర్లే పెట్టామంది. హిందీ పాఠ్యపుస్తకానికి గంగ అనీ, ఇంగ్లిష్ పుస్తకానికి కావేరి అనీ, అదేవిధంగా ఉర్దూ పాఠ్యపుస్తకానికి యమున అని పెట్టామంది.


