సహజంగా మెనోపాజ్ వచ్చిన మహిళలతో పోలిస్తే... శస్త్రచికిత్స ద్వారా మెనోపాజ్ (సర్జికల్ మెనోపాజ్) వచ్చిన మహిళల్లో లైంగిక సమస్యలూ, మూత్ర సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. సర్జికల్ మెనోపాజ్ అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా అండాశయాలను తొలగించడం వల్ల వచ్చే మెనోపాజ్ అని అర్థం.
మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడంతో... జననేంద్రియాలు, దిగువ మూత్రనాళ వ్యవస్థలో మార్పుల కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్యలతో కూడిన సిండ్రోమ్‌ను ‘జెనిటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’ (జీఎస్‌ఎమ్) అంటారు. సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళల్లో జీఎస్‌ఎమ్ లక్షణాలు చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తేలింది. లైంగిక సమస్యల్లో యోని పొడిబారడం, కలయిక సమయంలో నొప్పి, కోరిక తగ్గడం, కలయిక తర్వాత రక్తస్రావం ప్రధానంగా కనిపించాయి.
ఇక మూత్ర సంబంధ సమస్యల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పి కనిపించడం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రాన్ని అదుపులో ఉంచుకోలేక΄ోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. సర్జికల్ మెనోపాజ్‌కు గురైన మహిళల తాలూకు ఇతర ఫిజికల్ పరీక్షల్లోనూ జీఎస్‌ఎమ్ తీవ్రతను సూచించే స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
(చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?)


