క్లూషియల్
హోమ్ మినిస్టర్ బెనర్జీ ఇల్లు..
టెర్రస్ మీద వున్నాడు హోమ్ మినిస్టర్ బెనర్జీ. అతని ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ప్రద్యుమ్న.
‘ప్రద్యుమ్న! ఇది డిపార్ట్‌మెంట్ ఆర్డర్ కాదు. ఒక తండ్రిగా అడుగుతున్న సాయం. నా కూతురు నీల పెళ్లి మరో 24 గంటల్లో ఉంది. కానీ ఆమెను ‘విక్టర్’ అనే వంచకుడు మాయమాటలతో లొంగదీసుకుని ఎత్తుకెళ్లాడు. వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇదిగో వాడి క్రిమినల్ డేటా ఫైల్’ అని ఒక ఫైల్ అందించాడు.
ఆ ఫైల్‌లో విక్టర్ క్రిమినల్ రికార్డ్ వుంది. అతని ఫోటో కూడా వుంది. ఇన్‌స్పెక్టర్ ప్రద్యుమ్న క్రైమ్ ఆపరేషన్ మొదలుపెడితే ముందు కీలక ఆధారాలేవో చూస్తాడు. క్రాస్ వెరిఫికేషన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ ఇచ్చిన విక్టర్ ఫైల్ ఓపెన్ చేశాడు. ఫైల్ ఓపెన్ చేయగానే అతని పదునైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ పనిచేయడం ప్రారంభించింది.
క్రైమ్ బ్రాంచ్ సెంట్రల్ డేటాబేస్‌తో ప్రద్యుమ్న క్రాస్ వెరిఫికేషన్ చేశాడు. అందులో విక్టర్ ఫోటో అతికించిన పేజీ దగ్గర పిక్సెల్ వ్యత్యాసం, మార్ఫింగ్ గుర్తులు స్పష్టంగా కనిపించాయి. విక్టర్ ఫోటోను మార్ఫింగ్ చేసి తగిలించాడు. ప్రద్యుమ్న హ్యాకింగ్ టీమ్‌తో ఇంటర్‌పోల్ డేటాను స్కాన్ చేయించగా, ఆ క్రిమినల్ రికార్డ్ అంతా విక్టర్‌ది కాదు, ‘బెన్నీ’ అనే కిల్లర్‌ది అని తేలిపోయింది. విక్టర్ కేవలం ఒక విద్యాధికుడైన సామాన్య యువకుడని, బెనర్జీ డ్రైవర్‌గా పనిచేస్తూ నీలను ప్రేమించాడని ప్రద్యుమ్న కనిపెట్టాడు. ఇక్కడ ప్రద్యుమ్న తన మైండ్ గేమ్‌ను మొదలుపెట్టాడు.
∙∙
కొత్త సిమ్ సిగ్నల్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకోవడానికి ప్రద్యుమ్న ‘టవర్ ట్రయాంగులేషన్’ సాంకేతికతను వాడాడు. మూడు వేర్వేరు మొబైల్ టవర్ల సిగ్నల్ రేడియస్‌ను విశ్లేషించి, వారు కచ్చితంగా నగర శివార్లలోని పాత వంతెన పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని కనిపెట్టి, వారి లైవ్ లొకేషన్ ను లాక్ చేశాడు. సిగ్నల్ క్లోనింగ్ లొకేషన్ దొరకగానే ప్రద్యుమ్న వారి సిగ్నల్‌ను తన రూట్ మ్యాప్‌కు క్లోన్ చేసుకుని, అక్కడికి వెళ్ళాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నారు విక్టర్... నీల..
అదే సమయంలో హోమ్ మినిస్టర్ సుపారీ ఇచ్చి పంపిన కిల్లర్ బెన్నీ కంటే ముందే అక్కడికి చేరుకోగలిగాడు.
కిల్లర్ బెన్నీ తుపాకీ గురిపెట్టి విక్టర్‌పై కాల్పులు జరపబోయాడు. సరిగ్గా అదే సమయంలో ప్రద్యుమ్న తన సర్వీస్ రివాల్వర్‌ను బయటకు తీశాడు. బుల్లెట్లు కిల్లర్ బెన్నీ బాడీలోకి దూసుకువెళ్లాయి.
∙∙
‘సార్, మీరు చెప్పినట్టే మీ కూతురు నీలను ఎత్తుకెళ్లిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను షూట్ చేసి చంపేశాను. కాకపోతే అతని పేరు విక్టర్ కాదు, బెన్నీ. మీరు ఫైల్‌లో ఇచ్చిన అన్ని వివరాలు మ్యాచ్ అయ్యాయి, ఫోటో తప్ప... అన్నట్టు ఈ ఆపరేషన్‌లో మీ కూతురు నీల, ఆమెను ప్రేమించిన విక్టర్ సాయపడ్డారు...’ అంటూ తల వెనక్కి తిప్పాడు.
నీల, విక్టర్ లోపలికి వచ్చారు.
బెనర్జీ తన టేబుల్ సొరుగులో ఉన్న రివాల్వర్ తీశాడు పట్టరాని కోపంతో...
ప్రద్యుమ్న కూల్‌గా టేబుల్‌పై ఒక పెన్ డ్రైవ్ పెట్టాడు. ‘సార్, చనిపోయింది మీ హిట్‌మ్యాన్ బెన్నీ... ఇంటర్‌పోల్ క్రిమినల్ ఫైల్‌ను మీరు మార్ఫింగ్ చేసిన సాక్ష్యం, బెన్నీతో మీరు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఇందులో ఉన్నాయి. మీరు నోరు తెరిస్తే ఈ నిజం బయటపడి మీ పరువు, పదవి రెండు పోతాయి. విక్టర్ యోగ్యుడు. వాళ్ళను ఆశీర్వదిస్తే మీరు చేసిన పాపం, నేరం కొంతవరకైనా తగ్గుతాయి. లేదంటే మీ ఇష్టం’ అని వెనుదిరిగాడు.
∙∙
హోమ్ మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేసిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బెన్నీని వెంటాడి ఎదురు తిరగడంతో షూట్ చేసిన ప్రద్యుమ్న.. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి సహకరించిన హోమ్ మినిస్టర్ కారు డ్రైవర్ విక్టర్ తో పెళ్లి జరిపించిన హోమ్ మినిస్టర్ గొప్ప మనసు.
మీడియాలో బ్రేకింగ్ న్యూస్...
అంతకు మించి ఇన్‌స్పెక్టర్ ప్రద్యుమ్న ‘డిజిటల్ మైండ్ గేమ్’లో నుంచి బయట పడడానికి మరో ఆప్షన్ లేదు హోమ్ మినిస్టర్‌కు.
- శ్రీసుధామయి


