జపాన్‌లో షికోకు దీవిలోని తోకుషిమా నగరంలో సందడి మొదలైంది. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ‘అవా ఒడోరి’ సంప్రదాయ నృత్యోత్సవ సంరంభానికి సిద్ధమైంది. ఏటా ఆగస్టు 12 నుంచి 15 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించడానికి పదిలక్షల మంది సందర్శకులు తరలి వస్తారని అంచనా. ఈ వేడుకల్లో వేలాదిమంది సంప్రదాయ నర్తకులు పాల్గొంటున్నారు.
మామూలు రోజుల్లో ప్రశాంతంగా ఉండే తోకుషిమా నగరం ఈ నాలుగు రోజులు మాత్రం రంగుల ప్రపంచంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులను మూసివేసి డాన్స్ షోల కోసం ప్రత్యేకమైన స్టేజ్‌లు, సందర్శకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నది ఒడ్డున వెలిసే సంప్రదాయ స్ట్రీట్ ఫుడ్ షాపులు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈ ఉత్సవ వైభవం బ్రెజిల్‌లోని రియో కార్నివాల్‌ను తలపిస్తుంది.
వందల ఏళ్ల చరిత్ర..
ఈ నృత్యోత్సవం ఆవిర్భావం వెనుక మూడు ప్రత్యేకమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది బోన్ ఒడోరి. జపాన్‌లో ఏటా వేసవిలో పితృదేవతల జ్ఞాపకార్థం జరుపుకునే ఒబోన్ పండుగలో చేసే బోన్– ఒడోరి నృత్యం నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని ఒక నమ్మకం. రెండోది ఒక కోట నిర్మాణం. క్రీ.శ. 1587లో హాచిసుకా ఇయెమాసా అనే రాజు తోకుషిమా కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు విందు ఇచ్చాడు. ఆ ఆనందంలో సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ప్రజలంతా మైమరిచి చేసిన బృంద నర్తనమే కాలక్రమేణా ‘అవా ఒడోరి’గా మారిందంటారు. మూడోది జాపనీస్ నోహ్ నాటకాలకు మూలమైన ఫుర్యూ నృత్యం నుంచి ఈ పండుగ వచ్చిందనేది మరో కథనం.
అందరూ ఆహ్వానితులే!
ఈ అవా ఒడోరి వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో నృత్యకారులు ‘రెన్’, ‘నివాకా రెన్’ అని పిలిచే బృందాలుగా ఏర్పడతారు. సాధారణ ప్రజలు, పర్యాటకుల కోసం నివాకా రెన్ అనే వేదికను ఏర్పాటు చేస్తారు. వీరు ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. డాన్స్ ప్రారంభించే ముందు ప్రసిద్ధ కళాకారుల నుంచి ఉచితంగా స్టెప్పులు నేర్చుకుని వేడుకల్లో పాల్గొనవచ్చు.
సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన రహదారులను మూసివేసి డాన్సులు చేస్తుంటారు. అంతేకాదు, ఆగస్టు నెలలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనలేని పర్యాటకుల కోసం నగర కేంద్రంలోని ‘అవా ఒడోరి కైకాన్’ భవనంలో ఏడాది పొడవునా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. పగటిపూట ప్రత్యేక షోలతో పాటు, ప్రతిరోజూ రాత్రి ప్రసిద్ధ డాన్స్ గ్రూపులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తాయి. సందర్శకులకు డాన్స్ నేర్పి, వారితో కలిసి స్టెప్పులు వేయిస్తారు.
విభిన్న నృత్య శైలులు
ఈ అవా ఒడోరిలో మహిళలు, పురుషుల డాన్స్‌స్టైల్ వేరువేరుగా ఉంటుంది. మహిళలు ఎంతో సొగసుగా, కాలివేళ్లపై నిల్చుని నాట్యం చేస్తారు. ఇందుకోసం నల్లటి సంప్రదాయ చెక్క చెప్పులను ధరిస్తారు. వీటి నుంచి వచ్చే క్లిక్–క్లాక్ శబ్దాలు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై విసనకర్ర ఆకారంలో ఉండే ‘అమిగాసా’ అనే గడ్డితో చేసిన టోపీలను ధరిస్తారు.
ఇక పురుషులు ‘హప్పి’ అనే వదులైన సంప్రదాయ దుస్తులు ధరించి చాలా ఫాస్ట్‌గా కదులుతూ డాన్స్‌లు చేస్తుంటారు. పేపర్ లాంతర్లను గాల్లో వేగంగా తిప్పుతూ వెలుగులతో విన్యాసాలు చేస్తారు. ఈ వేడుకలు జరిగే నాలుగు రోజుల పాటు షామిసేన్ అనే మూడు తీగల వాయిద్యం, యోకోబుయె అనే వెదురు పిల్లన గ్రోవి, కానే (గంట), తైకో (పెద్ద డ్రమ్స్) వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇదే సమయంలో పర్యాటకులు సైతం సంప్రదాయ పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటారు.
∙ రమా జంబుల


