లెఫ్ట్‌..! రైటే | Sakshi Funday Special Story: International Left-Handers Day to Be Observed on August 13 | Sakshi
Sakshi News home page

లెఫ్ట్‌..! రైటే

Aug 9 2026 1:45 AM | Updated on Aug 9 2026 1:45 AM

Sakshi Funday Special Story: International Left-Handers Day to Be Observed on August 13

ఆగస్టు 13న ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ అన్నాడో కవి. ప్రపంచంలో కుడిచేతివాటం వాళ్ల జనాభాదే మెజారిటీ. మెజారిటీని ఆమోదించడమే ప్రజాస్వామ్యం కదా! కుడిచేతివాటం వాళ్లకు పెద్దగా సమస్యలు లేవు. విరివిగా దొరికే వస్తువులన్నీ వారు వాడటానికి అనువైనవే! అలాగని ఎడమచేతివాటం వాళ్లు నిరాశపడాల్సిందేమీ లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ల కోసమూ ప్రత్యేకంగా వస్తువులు వస్తున్నాయి. ఎడమచేతివాటం వస్తువుల దుకాణాలు ప్రత్యేకంగా వెలుస్తున్నాయి. ఎడమచేతివాటం వాళ్లలో ఎందరెందరో ప్రముఖులు ఉన్నారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలలో తమదైన ముద్రవేసిన వారు ఉన్నారు. అలాంటి లెఫ్ట్‌ హ్యాండర్స్‌ ఎందరో ‘లెఫ్ట్‌’ రైటేనని నిరూపిస్తున్నారు.

కుడిచేత్తో రాయడం... తినడం... ఆడటం... ఇవన్నీ మనకు సహజంగానే కనిపిస్తాయి... కానీ ప్రపంచంలో పదిమందిలో ఒకరు మాత్రం తొమ్మిది మందికి భిన్నంగా ఎడమ చేతిని ఈ పనులకు  ఉపయోగిస్తారు. ఈ చిన్న తేడానే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎన్నో అపోహలకు, వివక్షకు, పరిశోధనలకు  ఇదే కారణమైంది. కానీ కాలం మారింది... ‘ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్య.. బుల్లెట్‌ దిగిందా?.. లేదా?’ అని పండుగాడి డైలాగ్‌లా... ఏ చేయి వాడామన్నది కాదు... పోటీప్రపంచంలో నిలదొక్కుకున్నామా?  లేదా? అనేదే  ప్రస్తుతం సమాజం చూస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే నిర్వహిస్తారు. డీన్‌ ఆర్‌. క్యాంప్‌బెల్‌ అనే వ్యక్తి 1992లో ఈ క్లబ్‌ అధికారికంగా లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డేని నిర్వహించింది. ఆగస్టు 13నే ఎందుకు నిర్వహిస్తున్నారనే దానికి ప్రత్యేక కారణం ప్రకటించనప్పటికీ 1992లో ఆ రోజునే మొదటి అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో అదే తేదీన ఏటా లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డేని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడమచేతి వాటం వారిపై ఉన్న అపోహలను తొలగించడం, వారి అవసరాలను తయారీ సంస్థలకు తెలియజేయడం, వారికి అనుకూలంగా ఉండే వస్తువులు తయారు చేసేలా అవగాహన కల్పించడం ఈ క్లబ్‌ ముఖ్య ఉద్దేశాలు.

ఎడమ చేతి వాటం ఉన్న వారికి కలిగే  ప్రయోజనాలు, సవాళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు. ఆ రోజు వివిధ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, లెఫ్ట్‌ హ్యాండ్‌ వస్తువుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారు ప్రత్యేకమైన వారు అని కాదు, అందరూ సమానమే అని చాటి  చెబుతారు. ప్రతి వ్యక్తి తన సహజమైన చేతివాటంతో నేర్చుకునే, జీవించే, పనిచేసే హక్కు కలిగి ఉన్నాడనే సందేశాన్ని ఆ రోజు ప్రపంచానికి తెలియజేస్తారు.

ఎడమచేతి వాటానికి కారణం?
శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనికి ఒకే కారణాన్ని నిర్ధారించలేదు. ఎడమచేతి వాటానికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని ఎక్కువ మంది పరిశోధకుల అభిప్రాయం. మన శరీరంలో కుడి–ఎడమ వైపుల అభివృద్ధిని ప్రభావితం చేసే కొన్ని జన్యు మార్పులు ఎడమ చేతివాటంతో సంబంధం కలిగి ఉండవచ్చని  పీఎల్‌ఓఎస్‌ జెనిటిక్స్‌ జర్నల్‌లో ఓ పరిశోధన ఫలితాల్ని ప్రచురించారు.

సెంట్‌ అండ్రూస్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన మరో అధ్యయనంలో ఎడమ చేతి వాటం గల వారిలో కనిపించే కొన్ని జన్యు లక్షణాలు ‘సీటస్‌ ఇన్‌ వర్సస్‌’ అనే అరుదైన పరిస్థితితో పోలికలు కలిగి ఉండవచ్చని సూచించారు. ఈ పరిస్థితిలో గుండె, కాలేయం వంటి ప్రధాన అవయవాలు సాధారణ స్థానానికి వ్యతిరేక దిశలో ఉంటాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న వారందరికీ ఈ పరిస్థితి ఉంటుందన్న అర్థం కాదు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జన్యువులు చేతివాటాన్ని నిర్ణయించే అంశాల్లో ఒకభాగం మాత్రమే. మిగిలిన భాగం గర్భంలో జరిగే అభివృద్ధి, జీవసంబంధ ప్రక్రియలు, ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉండొచ్చు.

రాతి యుగంలోనూ...
ఎడమ చేతి వాటం ఆధునిక కాలంలోనే ఏర్పడిన అలవాటు కాదు. ఇది ఏళ్ల తరబడి మానవ జన్యు, మెదడు అభివృద్ధికి సంబంధించిన సహజ లక్షణం. రాతి యుగంలో మనుషులు తయారు చేసిన పనిముట్లు కుడి, ఎడమ రెండు చేతులతోనూ  ఉపయోగించేందుకు అనువుగా ఉండేవి. గుహల్లో కనిపించే వివిధ చిత్రాలను పరిశీలించిన ప్పుడు ఆదిమానవులు వాటిని చెక్కడానికి ఎడమ చేతిని ఎక్కువగా వినియోగించినట్టు కొంతమంది పరిశోధకులు గుర్తించారు. అయితే కాలక్రమేణా పనిముట్లు మరింత అభివృద్ధి చెందడంతో ఒకే చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఏర్పడింది. తరువాత సూర్యారాధన వంటి ఆధారాల ప్రభావంతో కుడిచేతి వినియోగం మరింత ప్రాచుర్యం పొందిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.

అపోహలు
చాలాకాలం పాటు ఎడమచేతి వాటాన్ని సహజ లక్షణంగా కాకుండా ఒక లోపంగా భావించారు. ప్రసవ సమయంలో సమస్య వల్ల పిల్లలకు ఎడమ చేతివాటం వస్తుందని నమ్మేవారు. రోజువారీ పనులను ఎడమ చేతితో చేయడం అనాగరికం లేదా గౌరవం లేనిదిగా భావించే సంప్రదాయం సమాజంలో క్రమంగా ఏర్పడింది. మనదేశంలో చేతి వాడకంపై సేకరించిన వివిధ సర్వేల ఆధారంగా స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఎడమచేతి వాటం కలిగి ఉన్నారు.

దేశంలో ఎడమచేతితో పనులు చేయడాన్ని చాలామంది ఇప్పటికీ అసాధారణంగా భావిస్తుంటారు. ఎడమచేతివాటం కలిగిన వ్యక్తి సహజంగానే ఎడమచేతితోనే రాస్తాడు, మిగతా పనులకు ఎక్కువగా అదే చేతిని ఉపయోగిస్తాడు. ఎందుకంటే మెదడులోని కుడి భాగం (రైట్‌ హ్యామ్స్‌ఫియర్‌) ఎక్కువగా పనిచేసే వ్యక్తులు సహజంగానే ఎడమచేతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. 

ఎడమ చేతివాటం వారు తక్కువ కాలం జీవిస్తారనే ప్రచారం ఉంది. దానికి బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు నిరూపించారు. 1988లో అమెరికాకు చెందిన ఇద్దరు పరిశోధకులు స్టాన్లీ కోరెన్, డయాస్‌ హాల్పెర్న్‌లు– ఎడమ చేతివాటం ఉన్న వారు కుడిచేతి వాటం ఉన్న వారికంటే సగటున 8–9 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పరిశోధనలో లోపం ఉందని తర్వాత శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే కుడిచేతి వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన పరికరాలు, యంత్రాలను వాడే సమయంలో వీరు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువ అని పరిశోధకులు పేర్కొన్నారు.

రోజువారీ సవాళ్లు
⇒ ప్రపంచంలోని చాలా వస్తువులు, పరికరాలు, పని విధానాలు కుడి చేతివాటం వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఫలితంగా ఎడమ చేతివాటం ఉన్న వారు రోజువారీ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

⇒ మార్కెట్‌లో తయారు చేసే కత్తెరలు కుడిచేతి వారికోసం తయారు చేసినవే. ఫలితంగా ఎడమ చేతివారు వాటితో కత్తిరించేటప్పుడు. బ్లేడ్‌ సరిగా కనిపించకపోవడం, ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి రావడం, చేతికి అసౌకర్యం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

⇒ పాఠశాలలు, కళాశాలల్లో ఉండే అటాచ్డ్‌ రైటింగ్‌ డెస్కులు కుడిచేతివారిని దృష్టిలో పెట్టుకుని తయారవుతాయి. ఫలితంగా ఎడమచేతివాటం ఉన్న వారి చేయికి సరైన ఆధారం దొరకదు. ఎక్కువ సేపు రాయడం అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో త్వరగా అలసిపోతారు.

⇒ బాటిల్‌ మూత తెరిచే  ఓపెనర్లు, స్పైరల్‌ నోట్‌బుక్స్, కిచెన్‌ సామగ్రి, గిటారు, కంప్యూటర్‌ మౌస్‌ వంటి పరికరాలు ప్రధానంగా కుడిచేతి వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వీటిని ఉపయోగించడం వీరికి కొంత అసౌకర్యంగా ఉంటుంది.

ఇది సహజమే... మార్చొద్దు...
కుడిచేతితో ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని శుభకరంగా భావించే సంప్రదాయం, అలవాటు మన సమాజంలో బలంగా ఉంది. ఎడమ చేతితో ఆ పనుల్ని చేయడాన్ని అశుభంగా భావిస్తారు. దీంతో అనేకమంది ఎడమచేతి వాటాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో పాఠశాలల్లో  ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల అలవాటు మార్చేందుకు ప్రయత్నించేవారు. కుడిచేతితో బలవంతంగా రాయించేవారు.

దీనివల్ల ఆ పిల్లల సహజమైన ఎదుగుదల దెబ్బతింటుంది. అందరూ నిరుత్సాహం కలిగిస్తే వారి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమవుతుంది. ఎడమ చేతి వాటం లోపం కాదు. అది మనిషి సహజమైన జీవ వైవిధ్యంలో ఒక భాగం. వారిని మార్చాలని ప్రయత్నించకుండా, వారి సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని గౌరవించడం అవసరం. సమాజంలో వారికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం, గౌరవం లభించినప్పుడే వారి ప్రతిభ పూర్తిగా వికసిస్తుంది.

ఎందరో ప్రముఖులు
కళలు, క్రీడలు, రాజకీయరంగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఎడమచేతి వారే. ఎడమ చేతివాటం వారిలో అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, రచయితలు ఉండడం వల్ల సహజంగానే సృజనాత్మకత ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒక సమస్యకు అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించే సామర్థ్యంలో ఎడమచేతివారు కొంతమెరుగ్గా ఉండొచ్చని కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. అయితే ఎడమచేతి వాటం కలిగిన అందరికీ ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. విజయానికి కారణం కేవలం ఎడమచేతి వాటమే అని చెప్పలేం. ప్రతిభ, కృషి, అవకాశాలు, శిక్షణ వంటి అనేక అంశాలు కలిసి వారి విజయాన్ని నిర్ణయించాయి. పలు దేశాల అధ్యక్షులు ఎడమ చేతివాటం వారే... అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టల్‌ చర్చిల్, బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ విలియం.  

మన దేశంలో.. అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, రతన్‌ టాటా, సచిన్‌ టెండూల్కర్‌.

నేను చిన్నప్పుడు ఎడమ చేత్తో రాయడం ప్రారంభించాను... నాకు నాలుగైదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇది గమనించిన నా తండ్రి నాపై కోప్పడ్డారు. కుడి చేత్తో రాయాలని సూచించారు. దీంతో నేను ఇప్పుడు రెండు చేతులతో రాయగలను. అయినా కొన్ని పనులకు ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తా. 
– అమితాబ్‌ బచ్చన్‌

ఎడమ చేతితో రాసే వారికి రాస్తున్నప్పుడు చేయి కళ్లకు, ఇప్పటికే రాసిన అక్షరాలకు మధ్య అడ్డుగా వస్తుంది. దాంతో ఏం రాస్తున్నారో స్పష్టంగా కనిపించక చాలా మంది లెఫ్ట్‌హ్యాండర్స్‌ చేతిని పైకి ఎత్తి రాయడానికి ప్రయత్నిస్తారు. దీంతో కొంతమందిలో చేయి కొక్కెం మాదిరిగా వంగిపోతుంది. దీనినే హుక్డ్‌ పొజిషన్‌ అంటారు. ఇది కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సేపు రాయలేరు.

⇒  ఉపాధ్యాయులకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఇన్‌క్లూడింగ్‌ చిల్ట్రన్‌ మార్గదర్శక పుస్తకంలో... పిల్లవాడు ఎడమ చేతితో రాస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు కుడి చేతితోనే రాయాలని పిల్లాడిపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనికి ఎన్‌సీఈఆర్‌టీ ఈ విధంగా పేర్కొంది: ‘భారతీయ సమాజంలో కుడిచేతికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక సంప్రదాయం. ఎడమచేతి వాటం పిల్లలను బలవంతంగా కుడిచేత్తో రాయించడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు సహజంగా పనిచేసే విధానానికి ఆటంకం కలగవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. త్వరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని హెచ్చరించింది.

⇒  రెండేళ్ల వయస్సు వచ్చే వరకు చిన్న పిల్లలు రెండు చేతులూ ఉపయోగిస్తారు. తర్వాత ఒక చేతినే ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తారు.  తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ ఎడమ చేతి వాటం ఉంటే, పిల్లలకు కూడా ఎడమ చేతి వాటం వచ్చే అవకాశం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కచ్చితంగా వస్తుందని చెప్పలేం.

⇒ ఒకే గర్భంలో ఉన్న కవలలు ఒకే జన్యువులు పంచుకున్నా కొన్నిసార్లు ఒకరు ఎడమచేతి వాటం, మరొకరు కుడిచేతి వాటం కలిగి ఉండొచ్చు. జన్యువులతో పాటు గర్భంలో మెదడు అభివృద్ధి సమయంలో జరిగే ఇతర జీవ సంబంధ ప్రక్రియలు కూడా ప్రభావం చూపుతాయి.

⇒ క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లో ఎడమ చేతివాటం వారికి కొంత ప్రయోజనం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎక్కువమంది ఆటగాళ్ల కుడిచేతివారితో ఆడేందుకు అలవాటు పడతారు. ఎడమ చేతివాటం వారిని ఎదుర్కొన్నప్పుడు వారి బంతుల కోణం, షాట్లు, కదలికలు భిన్నంగా ఉండడంతో ప్రత్యర్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది.

⇒ కొన్ని జంతువులు కూడా ఎడమచేతి వాటాన్ని ప్రదర్శిస్తాయి. కాకపోతే మనుషుల్లా అంత స్పష్టత వీటిలో కనిపించదు. కంగారూలు తినడానికి, ముఖం నిమురుకోవడానికి ఎక్కువగా ఎడమ కాలిని వాడతాయని పరిశోధనల్లో తేలింది. మగ కుక్కలు ఎడమ పాదాన్ని ఎక్కువగా వాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చెట్టు నుంచి యాపిల్‌ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. అలాగే తన కొడుకు స్కూల్‌లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన ఎడమచేతివాటం వాళ్ల కోసం కొత్త ఉత్పత్తుల తయారీకి పురిగొల్పింది.. ఒకప్పుడు బలవంతంగా కుడిచేత్తో రాయించే తల్లిదండ్రుల్లా కాకుండా, కొడుకు ఎడమచేతివాటానికి అనుగుణంగా ఉండేలా వస్తువుల తయారీకి ముందడుగు వేసేలా చేసింది. ఎందరో లెఫ్ట్‌ హ్యాండర్స్‌కు చేయూతను అందించేలా చేసింది. 

ప్రత్యేక స్టోర్‌లు 
ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మాత్రమే ఎడమచేతివారు. మిగిలిన 90 శాతం మంది కుడి చేతివారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారైన వస్తువులనే ఇద్దరూ వాడాల్సి వస్తోంది. దాంతో ఏదైనా కత్తిరించడం, రాయడం, గిటార్‌ వాయించడం ఇలా చిన్న చిన్న పనులు కూడా ఎడమచేతి వాటం ఉన్న వారికి అసౌకర్యంగా మారుతున్నాయి. ఫలితంగా లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కోసం ప్రత్యేకంగా షాపులు వెలుస్తున్నాయి. ఆన్‌లైన్‌ స్టోర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫుణేలో ఓ తండ్రి తన కుమారుడు చదువులో రాణించలేకపోవడానికి కారణం కుడి చేతి వస్తువులను ఉపయోగించాల్సి రావడమే అని గుర్తించాడు. అలా మొదలైన ఆలోచన ‘ది లెఫ్ట్‌ హ్యాండ్‌ షాప్‌’కి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్, పూణేల్లో పేరెంట్స్‌ చేసిన ఇలాంటి ప్రయత్నమే పలువురు లెఫ్ట్‌ హ్యాండర్స్‌కు ప్రయోజనకరంగా మారింది.

ఏమిటి తేడా
లెఫ్ట్‌హ్యాండ్‌ కత్తెరకు బ్లేడ్‌లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్‌ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని సులభంగా కట్‌ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. పెన్‌కు ఉండే నిబ్‌ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్‌ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్‌ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్య దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేశారు. మొదట్లో వీటిని వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల వీటిపై అవగాహన, వినియోగం పెరగడంతో ధరలు కొంత అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక షాప్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. 

ఒకప్పుడు ఎడమచేతి వాటం వారి పట్ల వివక్ష ఉండేది. బలవంతంగా వారి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించేవారు. ఆ దశ నుంచి ఎడమ చేతివాటం సహజ వైవిధ్యంగా గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే కేవలం ఎడమచేతి వారికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, ప్రతి మనిషిలోని భిన్నత్వాన్ని గౌరవించాలనే సందేశాన్ని గుర్తు చేసే రోజు.

∙దిలీప్‌ మాదిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement