భక్త విజయం
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.
‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.
శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.
‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.
‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.
సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.
బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.
మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.
‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.
సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.
‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.
సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.
రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.
- సాంఖ్యాయన


